‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2025’లో ప్రోత్సాహక బహుమతి రూ.3 వేలు పొందిన కథ.
విమానంలో కిటికీ పక్కన కూర్చున్న వసుధ.. తన ఒడిలో మెత్తని ముఖమల్ టవల్లో చుట్టి ఉన్న తన ఏడాది వయసున్న బాబుని ఒక్కసారి గుండెలకి హత్తుకుంది. తేనెటీగలా ఝుంకారం చేస్తూ, విమానం ఆకాశపుటంచుల్లోకి పైపైకి సాగుతున్నా.. ఆమె మనసులోని ఆలోచనలు మాత్రం అథఃపాతాళంలో కొట్టుమిట్టాడసాగాయి. దిగులుతో ముసురుపట్టిన మబ్బులా ఉందామె ముఖారవిందం. ఏ క్షణాన్నైనా వర్షించేలా ఉన్నాయి ఆమె కళ్లు.
ఒకసారి తన కొడుకు గుండెల దగ్గర తన చెవిని ఆనించి చూసింది. శ్వాస అతికష్టం మీద పీలుస్తున్నట్లు తెలుస్తూనే ఉంది. కనీసం తొమ్మిది కేజీల నుంచి పది కేజీలదాకా ఉండాల్సిన బాబు.. ఎదిగీ ఎదగని ఆవయవాలతో, దాదాపు ఐదు కేజీల బరువుతో, ఒక శాపగ్రస్తుడిలా ఉన్నాడు. చిరునవ్వు అంటే ఏమిటో.. అసలేమీ ఎరగనట్లుగా పెదాలు బిగించి, తన చిన్నిచిన్ని పిడికిళ్లు బిగబట్టి, తపస్సు చేస్తున్న మునీశ్వరునిలా కళ్లు మూసుకుని నిశ్శబ్దంగా ఉన్నాడు. పాలు సరిగ్గా తాగడు. నిద్ర సరిగ్గా పోడు. ఏడుపు అందుకుంటే అదే పనిగా ఏడుస్తాడు. శరీరంలో ఎన్ని అవయవాలు సగం సగం ఎదిగాయో తెలీదు. నోరుంటే తన బాధను చెప్పేవాడేమో! కానీ, ఆ పసికందుకు అవేమీ తెలియవు కదా! బాబుకేసి చూసినప్పుడల్లా కన్నీళ్లు ఉబికి.. ఆమె చెక్కిళ్లగుండా జారి, బాబుకి చుట్టి ఉన్న టవల్‌ను తడిపేయసాగాయి.
పక్కనే కూర్చున్న కుమార్ ఆమెని చూసి మాటిమాటికీ చికాకు పడిపోసాగాడు. అమెరికాలో విమానం ఎక్కిన దగ్గర్నుంచీ అతనలా ఆమెను విసుక్కుంటూనే ఉన్నాడు.
“ఉన్నట్టుండి ఈ ప్రయాణం ఏమిటో నాకేమీ అర్థం కావటంలేదు. నీ డెలివరీ అప్పుడు మీ వాళ్లకుగానీ, మా వాళ్లకుగానీ వీసా దొరకలేదు. వాళ్లెవ్వరూ రాలేదని అప్పుడు ఏడ్చావు. ఇప్పుడు సెలవు దొరకటం కష్టమని చెప్పినా వినిపించుకోకుండా,
నీ మానాన నువ్వు ‘ఇండియా వెళ్లాల్సిందే!’ అని ఏడుస్తూ కూర్చున్నావు. ముందే చెప్తున్నా.. నీతోపాటు అక్కడ ఉండటం నాకు కుదరదు. మళ్లీ పదిహేను రోజుల్లో నేను వెనక్కి వచ్చేస్తాను.
అర్థమైందా?” అంటూ.
ఎయిర్‌హోస్టెస్ అటు వచ్చినప్పుడల్లా.. ‘ఏదైనా తింటారా?’ అని ఆంగ్లంలో అడుగుతున్నా, వసుధ తల అడ్డంగా ఊపుతూనే ఉంది. వసుధ ఏదో బాధలో ఉందని ఆమె గ్రహించింది. ఒక ఆడదాని మనసులోని బాధను మరో ఆడది మాత్రమే తేలిగ్గా పసిగట్టగలదేమో! అందుకే ఆ అమ్మాయి మరోసారి అటుగా వచ్చింది. వస్తూవస్తూ ఆపిల్ పండు ముక్కలున్న
ప్లేట్ నొకదాన్ని తెచ్చి, కుమార్ చేతికిచ్చి..
“ఎట్లీస్ట్ మేక్ హర్ టు ఈట్ దిస్” అని చెప్పి వెళ్లిపోయింది.
మళ్లీ అతనే అందుకుని..
“బాబుకి బాగాలేదు సరే! ఆ బాధ నాకు లేదనుకున్నావా? కానీ ఏం చేస్తాం! నెలలు నిండాక పుట్టి ఉంటే, బాబు మామూలుగా ఉండేవాడు. కానీ తప్పని పరిస్థితుల్లో ముందే డెలివరీ చెయ్యాల్సి వచ్చింది. ఆ సంగతి డాక్టర్ రజని ముందే చెప్పింది. ఔనా? కాదా?”
అనడిగాడు.
ఆమె ఔననలేదు. కాదనలేదు. ఆమె అసలు అతని మాటలు విన్నదో లేదో కూడా తెలీదు.
విమానం ఎంత వేగంగానైతే ముందుకు దూసుకెళ్తోందో, అంతకన్నా వేగంగా ఆమె ఆలోచనలు వెనక్కి వెళ్లసాగాయి.
ఆరోజు అర్ధరాత్రి…
అప్పుడు దాదాపు ఒంటిగంట అవుతోంది. నిద్రలోంచి మెలకువ వచ్చిన వసుధ ఇబ్బందిగా కదిలింది. పక్కన కుమార్ గాఢంగా నిద్రపోతున్నాడు. కడుపులో ఏదో తెలీని నొప్పి. కొద్దిసేపు ఆ నొప్పిని భరించింది. కొద్దిసేపటి తర్వాత ఇక భరించటం ఆమె వల్ల కాలేదు. అందుకే పక్కనున్న భర్తని గట్టిగా కుదుపుతూ..
“ఏమండీ! విపరీతమైన కడుపునొప్పి. తట్టుకోలేకపోతున్నాను” అన్నది.
దాదాపుగా అరుస్తున్నట్లుగా వసుధ పిలవటంతో కుమార్ చటుక్కున లేచి కూర్చున్నాడు. విషయం తెలుసుకుని, వెంటనే తాము ఎప్పుడూ వెళ్లే ఆసుపత్రికి ఫోన్ చేశాడు. డాక్టర్‌తో మాట్లాడాక..
“వసూ! ఆసుపత్రికి వెళ్దాం పద. మన అదృష్టవశాత్తూ అక్కడ నా స్నేహితురాలు డాక్టర్ రజని డ్యూటీలో ఉన్నది. అంబులెన్స్ వస్తోంది. రెడీగా ఉండు” అంటూ ఆమెను బయల్దేరదీశాడు.
ఆసుపత్రికి వెళ్లటం ఆలస్యం, రజని ఆమెను పరీక్షించింది. ఆ తర్వాత ఇద్దరినీ చూస్తూ..
“కండిషన్ కాస్త క్రిటికల్‌గా ఉంది. సి-సెక్షన్ చేయక తప్పదు” అన్నది.
“నాకింకా ఏడో నెలే నిండలేదు డాక్టర్!” అంది వసుధ ఆశ్చర్యంగా.
“ఆ సంగతి నాకు తెలుసు. కానీ, ప్రస్తుతం నీ కండిషన్ చాలా క్రిటికల్. కాబట్టి సర్జరీ చేసి బాబుని బయటికి తియ్యక తప్పదు. మరేం పరవాలేదు. అన్నీ నేను చూసుకుంటాగా. డోంట్ వర్రీ!” అని భరోసా ఇస్తూ, అక్కడి స్టాఫ్‌కి సైగ చేసింది.
‘ఆమెకు పుట్టబోయేది మగపిల్లవాడు’ అని వాళ్లకి మూడో నెలలో స్కానింగ్ చేసినప్పుడు ఆసుపత్రివాళ్లు చెప్పేశారు.
వసుధను హుటాహుటిన ఆపరేషన్ థియేటర్‌కు తరలించారు.
“నిజానికి ఈరోజు నాది నైట్ డ్యూటీ కాదు. అయితే మా కొలీగ్ అర్జెంట్ పనిమీద వెళ్లాల్సిరావడంతో నేను డ్యూటీలో ఉండాల్సి వచ్చింది. యూ ఆర్ సో లక్కీ!” వసుధను చూస్తూ అన్నది డాక్టర్ రజని.
లేబర్ రూములో బెడ్ మీద పడుకోబెట్టి, సెడెషన్ ఇచ్చిన తర్వాత ఇక ఏం జరిగిందో ఆమెకు తెలీదు. మెలకువ వచ్చేసరికి పక్కన బాబు లేడు. వెంటనే సిస్టర్ని పిలిచి..
“వెరీజ్ మై బేబీ?” అని అడిగింది వసుధ.
“హి వజ్ కెప్ట్ ఇన్ ఇంక్యుబేటర్” అని చెప్పిందా నర్స్.
“విల్ యు ప్లీజ్ కాల్ మై హస్బెండ్?” అనడిగింది.
పది నిమిషాల తర్వాత కుమార్ లోపలికి వచ్చాడు. వస్తూనే..
“కంగారుపడకు వసూ! ఎర్లీ డెలివరీ కదా! బాబు తక్కువ బరువుతో ఉన్నాడు. ఇలాంటి కేసుల్లో చిన్నచిన్న కాంప్లికేషన్స్ సహజం. బాబుని రేపు ఇక్కడికి తెచ్చేస్తారు” అన్నాడు.
అలా అన్న రెండురోజుల తర్వాతగానీ బాబుని ఆమెకు చూపించలేదు. అసలు తాను చూస్తున్నది బిడ్డనేనా? అని అనుమాన పడిందామె. బాబు సరిగ్గా అరచేతిలో సరిపోయేంత ఉన్నాడు. బిగ్గరగా ఏడుస్తున్నా అసలు గొంతే వినిపించలేదు. శ్వాస అందక ఇబ్బంది పడుతున్నట్లు తెలిసిపోతోంది. ఆమెకు బిడ్డని ఒకసారి చూపించి, మళ్లీ తీసుకెళ్లిపోయారు.
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసేముందు రజని ఆమెతో..
“ఐయామ్ సారీ! దురదృష్టవశాత్తూ మీ బాబు పుట్టడమే ‘మెదడు పక్షవాతం’తో పుట్టాడు. దీన్నే ఇంగ్లీషులో సెరిబ్రల్ పాల్సీ అంటారు. ప్రపంచవ్యాప్తంగా పుడుతున్న ప్రతి వెయ్యిమందిలో కనీసం ఒకరి నుంచి నలుగురు పిల్లలు ఇలా సెరిబ్రల్ పాల్సీకి గురవుతారని ‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’ వారి అంచనాలు చెబుతున్నాయి. దానికి అనేక కారణాలున్నాయి. అందులో ఎర్లీ బర్త్ ఒకటి. నెలలు నిండకుండానే పుట్టడం వల్ల మీ బాబుకు కూడా ఆ సమస్య వచ్చిందనుకుంటా! బాబుని చాలా జాగ్రత్తగా చూసుకోండి. అతనికి వయసు పెరిగేకొద్దీ దానినుంచి బయటపడే అవకాశాలు కొంతవరకు ఉన్నాయి” అని చెప్పింది.
దాంతో వసుధ మనసులో ఒక్కసారిగా దిగులు కమ్ముకుంది.
ఆసుపత్రిలో పదిరోజులున్నా బాబు పరిస్థితిలో ఏమాత్రం మార్పులేదు. ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటాడు. పిల్లవాడు పాలు సరిగ్గా తాగకపోవటాన్ని, తల స్థిరంగా నిలపలేకపోవటాన్ని చూశాక వసుధలో దిగులు
అధికమైంది.
నెలలు గడుస్తున్నకొద్దీ బాబులో కొంచెమైనా మార్పు వస్తుందేమోనని చూసింది. కానీ, ఏమీ లాభం లేకపోయింది. బోర్లాపడటం, పాకటం, లేచి నిలబడటానికి ప్రయత్నించటం లాంటి లక్షణాలేవీ బాబులో కనిపించలేదు. కొడుకులోని భావోద్వేగాలను సంకేతాల ద్వారానే అర్థం చేసుకోవాల్సి వచ్చేది. బాబు గొంతుతో చేసే కొన్ని శబ్దాల ద్వారా అతను సంతోషంగా ఉన్నాడా? చికాకుగా ఉన్నాడా? ఇబ్బంది పడుతున్నాడా? అన్నది తెలుసుకునేది. బాబు చప్పట్లు కొట్టే తీరును బట్టి అతని మానసిక పరిస్థితి అర్థం చేసుకునేది. మంచినీరు కావాలంటే గ్లాస్ పట్టుకునేవాడు. ఆకలేస్తే, వంటగదివైపు చూసేవాడు. లేదా స్పూన్లాంటిది నోట్లో పెట్టుకునేవాడు. కొడుకు ప్రవర్తన ఆధారంగా అతని భావాలను కనిపెట్టేది.
డాక్టర్ల సలహా మేరకు బాబుకోసం కుమార్ ఒక వీల్ చెయిర్ తెచ్చాడు. అది తెచ్చిన రోజున.. తన కొడుకు ఇక ఎప్పటికీ అందులోనే ఉండాల్సి వస్తుందేమోనని వెక్కివెక్కి ఏడ్చింది వసుధ. కుమార్ ఆమెను ఓదార్చాడు. బాబు కోలుకుని మళ్లీ మామూలు మనిషి అవుతాడని ఎంతగానో నచ్చజెప్పాడు.
బాబులో ఎలాంటి ఎదుగుదల లేకుండానే ఏడాది గడిచిపోయింది.
ఆ రోజు కుమార్ ఇంటికి వస్తూనే..
“ఈ నెలలోనే మన బాబు మొదటి పుట్టినరోజు. నువ్వుకూడా సహకరిస్తే కాస్త గ్రాండ్‌గా చేద్దామనుకుంటున్నాను. మిగిలిన పిల్లలను చూస్తే, మనవాడిలో మార్పు రావచ్చని డాక్టర్లు చెప్పారు” అన్నాడు.
వసుధలో ఏ మూలో ఆశ కలిగి, సరేనంది.
పుట్టినరోజు ఫంక్షన్ చాలా బాగా జరిగింది. ఆ ఫంక్షన్ అయిన మర్నాడే..
“నేను ఇండియా వెళ్తాను” అని భర్తతో చెప్పిందామె.
“నిన్న ఫంక్షన్‌కు వచ్చిన పెద్దవాళ్లని చూశాక నీకు మీ అమ్మానాన్నలమీద గాలి మళ్లినట్లుంది. కానీ ఉన్నట్లుండి వెళ్తానంటే ఎలా?” అన్నాడు కుమార్.
“ఏమో!? అదంతా నాకు తెలీదు. నేను ఒక్కదాన్నయినా సరే వెళ్తాను” అందామె.
“ఒక్కదాన్ని ఎలా పంపుతాను? ఆఫీసులో మనం సెలవులు కూడా చూసుకున్నాక ముగ్గురం వెళ్దాం. ఓకేనా?” అనునయంగా చెప్పబోయాడు.
కానీ, తాను వెళ్లాల్సిందేనంటూ ఆమె మంకుపట్టు పట్టటంతో, తప్పని పరిస్థితుల్లో కుమార్ తన భార్యను, కొడుకును తీసుకుని ఇండియాకి బయల్దేరాడు.
వసుధను వాళ్ల తల్లిదండ్రుల దగ్గర వదిలి, తన తల్లిదండ్రులను కూడా చూసి.. కుమార్ మళ్లీ అమెరికా విమానం ఎక్కేశాడు. వెళ్లేముందు ఒకసారి బాబుని విమానాశ్రయానికి తీసుకురమ్మని కబురు చేసినా.. వసుధ వెళ్లలేదు. ఫోన్ చేస్తే, నోటికొచ్చిన కారణమేదో చెప్పింది.
కొద్దిరోజులు గడిచాక.. తన భర్తనుంచి విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నట్లు తల్లిదండ్రులకు చెప్పింది వసుధ. ఆమె మాటలకు నిర్ఘాంతపోయిన ఆమె తల్లి.. ఏడుస్తూ చాలా గొడవ చేసింది. తండ్రి మాత్రం మౌనంగా ఉండిపోయాడు.
మర్నాడు ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో, ఆమె తండ్రి వచ్చి..
“ఏ కారణమూ లేకుండా నువ్వు ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవని నాకు తెలుసు తల్లీ! నువ్వీ నిర్ణయానికి రావటానికి కారణమేమిటో నాకైనా చెప్తావా?” అని అడిగాడు.
అప్పుడు చెప్పిందామె. అంతా విన్న ఆయన ముఖం గంభీరంగా మారిపోయింది.
‘ఓకే ప్రొసీడ్!’ అన్నట్లుగా.. కూతురి భుజం మీద చెయ్యి వేసి, సుతారంగా నొక్కి వెళ్లిపోయాడు.
తనకు కోర్టు నుంచి విడాకుల నోటీస్ రావటం చూసి కుమార్ ఆశ్చర్యపోయి, వెంటనే భార్యకు ఫోన్ చేశాడు.
“ఈ విడాకుల పత్రాలేంటి? నాకేమీ అర్థం కావటంలేదు. మన బాబు అలా పుట్టాడని విరక్తి చెందావా? అది భగవంతుని నిర్ణయం. దానికి మనమేం చేస్తాం? పెరిగేకొద్దీ వాడి ఆరోగ్యం బాగుపడుతుందని డాక్టర్లు చెప్పారు కదా! అదీగాక ఇండియాలోకన్నా ఇక్కడుంటేనే వాడికి మంచి వైద్యం అందుతుంది. తండ్రిగా నాకు బాధ్యత లేదనుకున్నావా? మనమిద్దరమూ ఉద్యోగం చేస్తున్నాం కాబట్టే.. ఇక్కడ హాయిగా బతుకుతున్నాం. అదంతా ఆలోచించకుండా ఏమిటీ పిచ్చి పని? నాకోసం కాకున్నా బాబుకోసమైనా వచ్చేసెయ్. అంతా సర్దుకుంటుంది” అని చెప్పాడు.
“ఇప్పుడు బాబు పడుకునే టైం. నీతో మాట్లాడేంత సమయం నాకు లేదు. నేను వాట్సాప్ మెసేజ్ చేస్తాను. చదువుకో. అన్నీ తెలుస్తాయి” అని ఫోన్ పెట్టేసిందామె. ఎప్పుడూ ‘ఏమండీ’ అనీ, ‘మీరు’ అని గౌరవంగా మాట్లాడే వసుధ.. అప్పుడంత నిష్కర్షగా, పుల్లవిరుపుగా ఎందుకు మాట్లాడిందో అతనికి అర్థం కాలేదు.
ఆరోజు రాత్రి ఆమెనుంచి అతనికి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. దానికోసమే ఎదురుచూస్తున్న అతను.. ‘ఆమె ఏం రాసిందా!?’ అని ఆత్రంగా వాట్సాప్ చాట్ ఓపెన్ చేశాడు. అందులో ఇలా ఉంది..
‘మిస్టర్ కుమార్! నిన్ను భర్తగా ఊహించుకున్నా, బహువచనంలో సంబోధించాలన్నా నాకు పరమ అసహ్యంగా ఉంది. అందుకు కారణం.. నువ్వు చేసిన పని. బాబు భవిష్యత్తు గురించి నేనెన్నో కలలు కన్నాను. కానీ, ఆ కలలన్నీ కల్లలు అయిపోయాయి. అందుకు ఆ విధాతే కారణమని ఆయన్ని నిందించాను. కానీ తర్వాత తెలిసింది.. అందుకు కారణం ఆ భగవంతుడు కాదు.. నువ్వే అని! ఆరోజు బాబు పుట్టినరోజు ఫంక్షన్ బాగా జరిగింది. ఆ ఫంక్షన్‌కి అమెరికాలోనే పనిచేస్తున్న మా పిన్ని కొడుకు కూడా వచ్చాడు.
చిన్నప్పటినుంచీ వాడికి నేనంటే ప్రాణం. ఆ ఫంక్షన్ తతంగాన్ని వీడియో తీసింది వాడే. ఫంక్షన్ అయ్యాక వీడియోలో రికార్డయిన ఒక దారుణాన్ని వాడు నాకు చూపించాడు. దాన్ని చూడగానే నీ నిజస్వరూపం బట్టబయలైంది. నువ్వు చాలా మంచివాడివని అందరూ చెప్పటంతో, నాకన్నా తక్కువ ఉద్యోగస్తుడివైనా నీతో పెళ్లికి సిద్ధపడ్డాను. కానీ, కొద్దిరోజులకే నీకు డాలర్లపైన ఉన్న ఆశనూ, మనదేశమంటే ఉన్న చులకన భావాన్నీ, అమెరికాలోనే సెటిలవ్వాలన్న నీ కోరికనీ తెలుసుకున్నాను. అమెరికాలో ఎన్నాళ్లున్నా నీకు అక్కడి సిటిజన్‌షిప్ రావటం కష్టమనీ, నీకు పుట్టబోయే కొడుకు అక్కడి సిటిజన్ అయితే.. కనీసం 16 ఏళ్ల తర్వాతైనా అక్కడి పౌరసత్వం పొందవచ్చన్న ఆలోచనలో నువ్వున్నావు. కానీ, నీ ఆశని అడియాస చేస్తూ, అక్కడ కొత్తగా వచ్చిన ప్రభుత్వం.. 2025 ఫిబ్రవరి 20 తర్వాత పుట్టిన పిల్లలకి సహజ పౌరసత్వం ఇవ్వటాన్ని నిషేధించింది.
ఆ చట్టం ఎక్కడ అమలవుతుందోనని నువ్వు కంగారుపడి పోయావు. అప్పుడే నీ మెదడులో ఒక దురాలోచన చోటుచేసుకుంది. నీ కొడుకు ఆ సంవత్సరం ఫిబ్రవరి 20 లోపలే పుడితే.. అప్పుడు వాడికి అక్కడి పౌరసత్వం వస్తుంది. వాడి ద్వారా నువ్వూ కొన్నేళ్లకి అక్కడి పౌరసత్వాన్ని పొందవచ్చు అనుకున్నావు. నీ స్నేహితురాలైన డాక్టర్ రజని వద్దంటున్నా, బలవంతంగా ఆమెను ఒప్పించి.. ఫిబ్రవరి 20కి ముందే నాకు లేని కడుపునొప్పి తెప్పించావు. సిజేరియన్ చేయించి, బిడ్డని బలవంతాన బయటికి తీయించావు. ఆ కారణంగానే పూర్తిగా ఎదిగీ ఎదగని అవయవాలతో, అనారోగ్యంతో ఉన్న బాబు పుట్టాడు. ఆరోజు ఫంక్షన్లో మన బాబుని చూసిన రజని.. ఆరోజు నువ్వంత బలవంత పెట్టకపోయి ఉంటే ఆ నీచకృత్యాన్ని చేసేదాన్నికానని తన స్నేహితురాలితో బాధపడుతూ చెప్పటం ఆ వీడియోలో చాలా స్పష్టంగా కనిపించింది. దాంతో నీమీద నాకు చెప్పలేనంత అసహ్యం కలిగింది. ఇంత ఘోరమైన పాపానికి ఒడిగట్టిన నీతో ఇక నేను జీవితాన్ని పంచుకోలేను.
అందుకే నీకు విడాకుల పత్రాలు పంపించాను. మర్యాదగా సంతకాలు చేసి పంపితే సరేసరి. లేదనుకో.. ఫంక్షన్లో రజని మాటలు రికడార్డయిన వీడియోని కోర్టులో జడ్జి ముందు పెడతాను. దాంతో లోకానికి నీ దుర్మార్గం తెలిసిపోతుంది. నా బాబు మేజర్ కాగానే ఎలాగూ వాడి అమెరికన్ సిటిజన్‌షిప్ క్యాన్సల్ చేయిస్తాను. అక్కడ వేల డాలర్లకోసం అమెరికావాడికి ఊడిగం చేసేకన్నా.. ఇక్కడ అభాగ్యులైన పిల్లలకు సేవ చేసుకోవటం ఉత్తమమని అనిపించింది. అందుకే అక్కడి ఉద్యోగానికి రాజీనామా చేసి, ఇక్కడ బాబులాంటి ఎందరో పిల్లలున్న స్కూల్లో టీచర్‌గా ఉద్యోగం సంపాదించుకున్నాను. ఇక బాబు ఇక్కడ పక్కా భారతీయుడిగానే పెరుగుతాడు. నీలాంటి నికృష్టుడి నీడ ఏమాత్రం పడనీయకుండా, నా బాబుని ప్రాణప్రదంగా పెంచుకుంటాను. ఇక్కడ వాడు మామూలు మనిషిగా మారతాడన్న నమ్మకం నాకుంది. నువ్వు మరీ అతితెలివి ప్రదర్శించకుండా వెంటనే విడాకుల పత్రాల మీద సంతకాలు పెట్టి పంపించు. గుడ్‌బై ఫరెవ్వర్!’ఆ మెసేజ్ చదివిన కుమార్ హతాశుడయ్యాడు. తన భార్య తనను వదిలేసినందుకు కాక.. తన కలలు కల్లలై, తన భవిష్యత్తు అగమ్యగోచరం కావటంతో కుంగిపోయాడు.
ఎదురుగా టీపాయ్ పైనున్న విడాకుల పత్రాలు, ఏసీ మిషన్‌లోంచి సన్నగా వీస్తున్న గాలికి రెపరెపలాడసాగాయి. ఆ పత్రాల్లాగే అతని ఒళ్లుకూడా కంపిస్తుండగా, నిస్సత్తువగా సోఫాలో కూలబడిపోయాడు.
అందుకే అక్కడి ఉద్యోగానికి రాజీనామా చేసి, ఇక్కడ బాబులాంటి ఎందరో పిల్లలున్న స్కూల్లో టీచర్‌గా ఉద్యోగం సంపాదించుకున్నాను. ఇక బాబు ఇక్కడ పక్కా భారతీయుడిగానే పెరుగుతాడు. నీలాంటి నికృష్టుడి నీడ ఏమాత్రం పడనీయకుండా, నా బాబుని ప్రాణప్రదంగా పెంచుకుంటాను. ఇక్కడ వాడు మామూలు మనిషిగా మారతాడన్న నమ్మకం నాకుంది.
సూర్య గండ్రకోట
స్వార్థం కోసం ఎంతకైనా తెగించే మనిషి బతుకుతున్న సమాజంలో మనమున్నాం. ఆ స్వార్థానికి పరాకాష్ట, దాని పర్యవసానాలు.. ఈ ‘డాలర్ డ్రీమ్స్’ కథలోని సారాంశం. రచయిత సూర్య గండ్రకోట. తెనాలి.. ఈయన జన్మస్థలం. భాగ్యనగరం నివాసస్థలం. తల్లి సరోజిని, తండ్రి వెంకయ్య. ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు సాహిత్యంతో ఎంఏ చేశారు. తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో 32 ఏళ్లు సర్వీస్ చేసి, ఏజీఎంగా పదవీ విరమణ చేశారు. ఈయన రాసిన కథల్లో ఇప్పటివరకూ 95 కథలు ప్రచురితమయ్యాయి. వాటిలో 35 కథలు బహుమతులు గెలుచుకున్నాయి. ఆనంద హేల, కలలు కౌముది, జాబిల్లి కోసం ఆకాశమల్లె నవలలు ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం ‘అంతశ్శత్రువు’ అనే ఐదో నవల తపస్వి మనోహరం పత్రికలో సీరియల్‌గా వస్తోంది. వ్యక్తిత్వ వికాసం కలిగించే పద్యాలు రెండు వందలకు పైగా రాశారు. ప్రస్తుతం భాగవతం దశమ స్కంధం సీస పద్యాల రూపంలో సహరి వీక్లీలో ప్రచురితమవుతున్నది.
సూర్య గండ్రకోట
96669 03960