హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో భూముల విలువను వాస్తవ మార్కెట్ ధరలకు అనుగుణంగా క్రమబద్ధీకరించాలన్న మంత్రివర్గ నిర్ణయంతో రిజిస్ట్రేషన్లకు భారీగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నెల 29 నుంచి జూన్ 3 వరకు పని వేళలను పెంచుతున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పని వేళలను ఉదయం 9:30 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు పొడిగిస్తున్నట్టు వివరించారు. భూముల రిజిస్ట్రేషన్లు జరిగే తహసీల్దార్ కార్యాలయాలతో సమన్వయం చేసుకొని ఎక్కడా ఆలస్యం లేకుండా విధులు అందించాలని మంత్రి స్పష్టం చేశారు.