డీసీపీ దగ్గర వారంపాటు సెలవు తీసుకొన్న ఇన్స్పెక్టర్ రుద్ర, హెడ్ కానిస్టేబుల్ రామస్వామితోపాటు ఫోరెన్సిక్ ఇన్చార్జి జయ, స్నేహిల్ ఇలా అందరూ తొలిరోజు తమ కుటుంబాలతో చక్కగా సేదతీరారు. ఆ రోజంతా టీవీలు, న్యూస్ పేపర్లలో ‘నల్లమల రహస్య ఛేదన’ మీదనే ప్రత్యేక చర్చ కొనసాగింది. ఉదయం నుంచి రుద్రకు వందలాది ఫోన్లు. ఎన్నెన్నో అభినందనలు. ఈ క్రమంలోనే నాగ్‌పూర్ సెంట్రల్ జైలు ఉన్నతాధికారి ఒకరు రుద్రకు ఫోన్ కలిపాడు. నల్లమల కేసును సాల్వ్ చేసిన రుద్రను అభినందిస్తూ ఓ కీలక విషయం చెప్పాడు. దీంతో నిశ్చేష్టుడైన రుద్ర.. ఆ వెంటనే రామస్వామి, జయ, స్నేహిల్ను కలిశాడు.
‘గంట ముందు నాగ్‌పూర్ సెంట్రల్ జైలు ఆఫీసర్ ఫోన్ చేశారు. రేపు ఓ ఖైదీని ఉరి తీయనున్నారట. ఆఖరి కోరిక ఏమైనా ఉందా? అని అడిగితే.. చివరగా నన్ను కలవాలని చెప్పాడట ఆ ఖైదీ’ అని రుద్ర ఒకింత షాక్‌లో ఉన్నట్టు చెప్తూ పోయాడు. ఆ వెంటనే స్పందించిన రామస్వామి, జయ, స్నేహిల్.. డీసీపీ గారి దగ్గరికి వెళ్దామన్నారు. అందరూ వెళ్లడానికి సిద్ధమవుతుండగానే.. డీసీపీ సత్యనారాయణే రుద్రకు ఫోన్ చేశాడు. ‘రుద్ర.. ఆ విషయం నాకు కూడా తెలిసింది. ఆ ఖైదీ నిన్ను కలవాలని ఎందుకు అనుకొంటున్నాడో తెలియాలంటే ముందు నువ్వు అక్కడికి వెళ్లు. నీతోపాటు రామస్వామి గారిని, జయ గారిని, స్నేహిల్ను కూడా తీసుకెళ్లు. అన్నట్టు నాగ్‌పూర్‌కు ఫ్లైట్ టికెట్లు బుక్ చేయించా.. రాగానే స్టేటస్ రిపోర్ట్ ఇవ్వు’ అని ఫోన్ కట్ చేశాడు. దీంతో అందరూ నాగ్‌పూర్ చేరుకొన్నారు.
‘సార్.. కేవలం 10 నిమిషాలు మాట్లాడటానికే అవకాశం ఉంది. అది కూడా మీ ఒక్కరికే. సెక్యూరిటీ ఆ పక్కనే ఉంటుంది. అయితే, మీ మాటలు వారికి వినబడవు. మరో విషయం.. ఆ ఖైదీ జగమొండి. మనం చెప్పేది వినడు. వాడు చెప్పిందే వినాలి. ఇన్నేండ్లలో వాడు నోరు తెరిచింది వెళ్లమీద లెక్కబెట్టొచ్చు.. ఏదేమైనా వాడితో జాగ్రత్త’ అని జైలు అధికారి హెచ్చరించాడు. సరే అంటూ లోపలికి వెళ్లాడు రుద్ర. ‘మీ పేరు?’ ఊచలకు ఇటువైపు నిల్చొని అడిగాడు రుద్ర. ‘మిస్టర్ రుద్ర. ఇంటర్వ్యూ చేస్తావని నేను నిన్ను పిలవలేదు. నీ గురించి, నల్లమలలో నీ ఆపరేషన్ గురించి నిన్ననే తెలుసుకొన్నా. అందుకే పిలిపించా. నేను చెప్పేది మాత్రమే విను. రేపు నన్ను ఉరితీయబోతున్నారు. అంతకంటే ముందే ఈ విషయం నీకు తెలియాలని పిలిపించా. మన ఇండియన్స్‌కు పిల్లలు పుట్టుకుండా.. అసలు నెక్ట్స్ జనరేషనే ఉండకూడదని ఏవేవో కుట్రలు జరుగుతున్నాయి.. చైనా-పాకిస్థాన్‌లు కలిసి ఏదో చేస్తున్నాయి.. అడ్డుకో’ అన్నాడు ఖైదీ.
అది విన్న వెంటనే రుద్రకు చెమటలు పట్టాయ్.. ‘అసలేంటి నువ్వు మాట్లాడేది? ఇండియన్స్‌కు పిల్లలు పుట్టుకుండా కుట్రలా? ఎందుకు?? అసలు చైనా, పాకిస్థాన్ మధ్యలోకి ఎందుకు వచ్చాయ్?? సరిగ్గా చెప్పు!’ అంటూ అన్నాడు రుద్ర. ‘ఏం రుద్ర.. అందరిలాగే ఈ ఖైదీ మాటలను నువ్వు కూడా..’ అంటూ ఆ ఖైదీ ఇంకా ఏదో చెప్పబోతుండగా.. అడ్డుపడిన రుద్ర.. ‘నేను నమ్ముతున్నా..! నిన్ను నమ్ముతున్నా.. నీ మాటలను కూడా నమ్ముతున్నా.. అసలేం జరిగిందో వివరంగా చెప్పు’ అని బతిమిలాడుతున్నట్టు అన్నాడు. ‘10 నిమిషాలు అయిపోయింది.. ఇక, నువ్వు వెళ్లొచ్చు’ అని చెప్పి ఊచల నుంచి దూరంగా వెనక్కి జరిగి చీకట్లోకి వెళ్లిపోయాడు ఆ ఖైదీ. రుద్ర ఎంత మొత్తుకొన్నా మళ్లీ మాట్లాడలేదు. టైమ్ దాటిపోవడంతో రూల్స్ ప్రకారం ఇక వెళ్లిపోండంటూ రుద్ర అండ్ టీమ్‌కు విజ్ఞప్తి చేశారు నాగ్‌పూర్ సెంట్రల్ జైలు అధికారులు.
‘నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది రుద్ర. కానీ, మరో ఐదారు గంటల్లో ఆ ఖైదీని ఉరి తీయబోతున్నారు. సుప్రీంకోర్టు, గవర్నర్, రాష్ట్రపతి క్షమాభిక్ష ఇలా ప్రాసెస్ అంతా ఎప్పుడో కంప్లీటెడ్. ఇప్పుడు ఉరిశిక్షను పోస్ట్‌పోన్ చేయలేమని పైస్థాయి వ్యక్తులు కూడా చెప్తున్నారు. గడిచిన మూడు నాలుగు గంటల నుంచి నేను ఇదే పనిలో ఉన్నా. డీజీపీ గారు, సీఎం గారితోనే కాదు పీఎంవో, రాష్ట్రపతి భవన్ వర్గాలతో కూడా మాట్లాడించా.. ఎవ్వరితోనూ పనికాలేదు. పైగా ఆ ఖైదీకి ఏమైనా జ్వర లక్షణాలు ఉన్నాయా? అని చూసినా ‘హి ఈజ్ పర్ఫెక్ట్లీ అల్రైట్’ అని తేలింది’ అంటూ తన నిస్సహాయతను వ్యక్తం చేశాడు డీసీపీ సత్యనారాయణ.
‘సార్.. మీరు ఆ చైనా-పాక్ గురించి చెప్పలేదా?’ అని సూటిగా అడిగాడు రుద్ర. మౌనంగా ఉండిపోయాడు సత్యనారాయణ. ‘సార్.. మిమ్మల్నే.. చెప్పలేదా?’ అంటూ మరోసారి గట్టిగా అడిగాడు రుద్ర. దీంతో నోరు తెరిచిన డీసీపీ.. ‘ఇన్స్పెక్టర్ రుద్ర.. కాసేపు ప్రొటోకాల్ పక్కనబెడదాం. అఫీషియల్‌గా కాకుండా నేనో ఫ్యామిలీ మెంబర్‌గా నీతో మాట్లాడాలనుకొంటున్నా..’ అంటూ కాస్త కఠువుగా మాట్లాడటం ప్రారంభించాడు సత్యనారాయణ. వింటున్నాడు రుద్ర. ‘ఏయ్ రుద్ర.. నిన్ను నా కొడుకులాగే అనుకొంటా. నా కంటే నీ మీదే నాకు నమ్మకం. అయితే, అందరూ నాలా ఉండరు కదా! చైనా-పాక్ గురించి ఉన్నతస్థాయి వారికి ఎప్పుడో చెప్పా.. “చావు భయంతో ఎలా బతుకుదామా? అంటూ ఓ ఖైదీ ఏదో చెప్తే మీరెలా నమ్ముతారంటూ..” వాళ్లు నవ్వారు. ఇవన్నీ కూడా నీకు చెప్పాలా? సరే.. ఆ విషయం వదిలేయ్. ఆ ఖైదీ చెప్పింది నిజమై ఉంటుందని నువ్వు అనుకొంటున్నావా?’ అన్న సత్యనారాయణ సూటి ప్రశ్నకు.. అవునంటూ సమాధానమిచ్చాడు రుద్ర. ‘అయితే, సరే.. నల్లమల కేసును సాల్వ్ చేసిన ఆ రుద్ర ఇప్పుడు నాకు మళ్లీ కావాలి. ఎలాగో ఇంకా జైలు బయటే ఉన్నావ్‌గా.. ఉరిని ఎలా ఆపాలో చూడు. నువ్వు లోపలికి వెళ్లడానికి మరోసారి అవకాశం వచ్చేలా చేస్తా.. అక్కడ జైలు డిప్యూటీ సూపరిండెంటెంట్ కరణ్ నా స్టూడెంటే. వెళ్లి అతన్ని కలువు. అయితే, ఆ ఖైదీని మాత్రం కలవగలవో లేదో మాత్రం నేను గ్యారెంటీ ఇవ్వలేను’ అంటూ సత్యనారాయణ అనగానే.. ఆగమేఘాలపై వెళ్లి జైలు సూపరిండెంటెంట్ను కలిశాడు రుద్ర.
‘రుద్ర.. సత్యనారాయణ సార్ అన్నీ చెప్పారు. అయితే, ఆ ఖైదీని మళ్లీ కలవడం కుదరదు. అలాగే ఉరిని కూడా ఆపలేం. అది కాకుండా వేరే ఏమైనా సాయం కావాలంటే చెప్పు’ అన్నాడు కరణ్. ‘సార్.. ఉరి తీసే ముందు రేపు ఉదయం ఖైదీకి ఏం బ్రేక్‌ఫాస్ట్ ఇస్తున్నారు?’ రుద్ర ప్రశ్నించాడు. ‘వాడు ఉల్లిదోశ అడిగాడు’ అంటూ బదులిచ్చిన కరణ్.. ఆ వెంటనే.. ‘రుద్రా! ఉరిని పోస్ట్‌పోన్ చేయడానికి మనం ఆ బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం కలిపినా సూపర్వైజ్ చేసే డాక్టర్ రిపోర్ట్‌లో అది బయటపడుతుంది. అది చాలా పెద్ద నేరం’ అంటూ ఉన్న విషయం చెప్పాడు కరణ్. ‘అది కాదు సార్.. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఖైదీ బ్రేక్‌ఫాస్ట్‌గా ఉల్లిదోశ అడిగాడని మీరు చెప్పడమే ఆలస్యం.. నాకో మంచి ఐడియా వచ్చింది. నాకు ఇప్పుడు మీ సాయం చాలా అవసరం. ఇంకో విషయం.. ఉరిని పోస్ట్‌పోన్ చేయడానికి నేను ఆ ఫుడ్‌లో ఏమీ కలపట్లేదు’ అంటూ కరణ్ చెవిలో ఓ విషయం చెప్పాడు రుద్ర. ‘వర్కౌట్ అవుతుందా?’ అని కరణ్ ప్రశ్నార్థకంగా చూస్తుండగానే అవునన్నట్టు రుద్ర సైగ చేశాడు. అంతే, ఆ మరునాడు ఖైదీకి వేయాల్సిన ఉరిని పోస్ట్‌పోన్ చేశారు. అది పక్కనబెడితే.. రుద్ర ఐడియాను మీరు కనిపెట్టారా?
సమాధానం: భారత చట్టాల ప్రకారం.. ఖైదీని ఉరితీసే ముందు అతను శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాడో లేదా చూస్తారు. ఉరితీసే వ్యక్తికి జ్వరం కూడా ఉండకూడదు. డాక్టర్‌తో పరీక్షలు చేయించాకే ఉరిశిక్షను అమలు చేస్తారు. ఇది తెలిసిన రుద్రకు.. ఉల్లిదోశ అనగానే ఓ మెరుపులాంటి ఆలోచన వచ్చింది. కోసిన ఉల్లిని చంకలో పెట్టుకొంటే సఫాక్సైడ్, ఐసోలిన్, ఎలిసన్ వంటి సహజ రసాయనాలు విడుదలై శరీరం ఒక్కసారిగా వేడెక్కిపోతుంది. వెంటనే జ్వరం వస్తుంది. పరీక్షల్లో కూడా ఆ కారణం బయటపడదు. దీంతో ఖైదీ లేవడానికి కొంచెం ముందు కరణ్ సాయంతో రుద్ర ఈ పని పూర్తిచేయించాడు. ఖైదీకి తీవ్ర జ్వరం వచ్చినట్టు డాక్టర్ గుర్తించడంతో మెజిస్ట్రేట్ ఆదేశాల ప్రకారం.. ఉరిని పోస్ట్‌పోన్ చేశారు. ఆ వెంటనే చైనా-పాక్ కుట్రలను కనుగొనే టాస్క్‌లోకి తన టీమ్‌తో దిగాడు రుద్ర.