Gaurav Gogoi : ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రజాసమస్యలపైన కంటే ఎక్కువగా ఇన్‌స్టా రీల్స్ (Insta Reels) పైననే దృష్టి పెడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ (Congress MP) గౌరవ్ గొగోయ్ (Gaurav Gogoi) ఎద్దేవా చేశారు. లోక్‌సభ (Lok Sabha) లో యాంటీ-పేపర్ లీక్ బిల్లు (Anti-paper leak bill) పై చర్చ సందర్భంగా గొగోయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాటం చేస్తుంటే.. మోదీ మాత్రం రీల్స్ చేస్తూ కూర్చున్నారని విమర్శించారు.
సమస్యపై కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌పైనే ఆయన ఎక్కువ దృష్టి పెట్టారన్నారని ఆరోపించారు. ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టేందుకు ప్రభుత్వం 2024లో ప్రవేశపెట్టిన చట్టం కఠినంగా ఉంటే.. పేపర్‌లీక్ ఎలా జరిగిందని ప్రశ్నించారు. లీకేజీ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఈ బిల్లుకు ప్రతిపాదించిన సవరణలను పరిశీలిస్తే.. అర్థవంతమైన మార్పును తీసుకురావాలని ప్రభుత్వం అనుకోవట్లేదనే విషయం తెలుస్తోందన్నారు. ఈ పరీక్షా సంస్కరణలు కేవలం కంటితుడుపు చర్యలేనని, గతంలో కూడా ప్రభుత్వం ఇలాంటి హామీలే ఇచ్చిందని పేర్కొన్నారు.
2024 నీట్ ప్రశ్నపత్రం లీకేజీని ప్రస్తావిస్తూ.. ఆ లీకేజీ జరిగినప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారని గొగోయ్ గుర్తుచేశారు. అప్పుడు కూడా ఎలాంటి లీకేజీ జరగలేదని కప్పిపుచ్చడానికి ఆయన ప్రయత్నించారని దుయ్యబట్టారు. సోమవారం బీజేపీ నేతలు ధర్మేంద్ర ప్రధాన్‌కు పార్లమెంట్లో ఘన స్వాగతం పలకడాన్ని తప్పుపట్టారు. తప్పును ఎదిరించి పోరాట స్ఫూర్తిని చాటిన విద్యార్థులకు గొగోయ్ ధన్యవాదాలు తెలిపారు. నిరసనకారులపై ప్రభుత్వం అమానవీయంగా ప్రవర్తించిందని విమర్శించారు.
నిరసనకారుల తలలపై పోలీసులు కొట్టారని గొగోయ్ ఆరోపించారు. అలా కొట్టాలని వారిని ఎవరు ఆదేశించారని ప్రశ్నించారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి దించి ప్రధాని మోదీని బీజేపీ కాపాడిందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, ఎంపీ అఖిలేశ్ యాదవ్ అన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించేలా ఒత్తిడి తెచ్చిన యువత నిరసనలను ప్రశంసించారు. దేవాలయాల విరాళాలను దొంగలించిన వారు.. ప్రశ్నపత్రాల లీకేజీని ఆపలేరని చమత్కరించారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని వెనకబడిన వర్గాల విద్యా హక్కులను దోచుకుంటోందని ఆరోపించారు.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారు దేశంలోని లక్షకుపైగా ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారని గొగోయ్ మండిపడ్డారు. కాగా ప్రతిపక్ష నేతల విమర్శలను బీజేపీ ఎంపీ బన్సూరీ స్వరాజ్ తిప్పికొట్టారు. యూపీఏ హయాంలో 2014 కు ముందు ఏకంగా 22 సార్లు ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని అన్నారు. ఇప్పుడు ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేసిన కాంగ్రెస్ నేతలు.. అప్పుడు రాజీనామా చేశారా..? అని ప్రశ్నించారు.