భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 14: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి (Bhoodan Pochampally) మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. పలు గ్రామాల్లో ఓటుకు భారీ ధర పలుకుతున్నది. దేశ్ముఖి, అంతమ్మగూడం గ్రామాల్లో సర్పంచులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటుకు ఏకంగా రూ.8,000 నుంచి రూ.10 వేల వరకు పంచుతున్నట్టు ప్రచారం సాగుతుంది. గ్రామాల్లో అభ్యర్ధులు పోటీ పడడంతో డబ్బు పంపిణీ చేస్తున్నారు. సాధారణ సర్పంచ్ ఎన్నికలకు రూ.10 వేలు పంపిణీ చేయడంపై జోరుగా చర్చ జరుగుతున్నది. ఆయా గ్రామాలకు పెద్ద మొత్తంలో ఆదాయ వనరులు ఉన్నట్లు తెలుస్తుంది.
రెండో విడతలో భాగంగా యాదాద్రి జిల్లాలోని 5 మండలాల్లో పంచాయతీ ఎన్నికల జరుగుతున్నాయి. 140 గ్రామాల్లో పోలింగ్ కొనసాగుతున్నది. ఇప్పటికే 10 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మరోవైపు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 23 మండలాల్లోని 539 గ్రామాల్లో పోలింగ్ జరుగుతున్నది. ఇందులో నల్లగొండ జిల్లాలో 10 మండలాలు 282 పంచాయతీలు ఉన్నాయి. రెండో విడతలో 38 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మరో 3 పంచాయతీల్లో ఎన్నికలు రద్దయ్యాయి. దీంతో ప్రస్తుతం 241 పంచాయతీలకు పోలింగ్ జరుగుతున్నది. ఇక సూర్యాపేటలో 8 మండలాల్లోని 181 గ్రామాల్లో పోలింగ్ కొనసాగుతున్నది. ఇందులో 23 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.