భువనగిరి కలెక్టరేట్ : జీవనోపాధి కోసం పలువురు చిరు వ్యాపారులు ప్రభుత్వ భూమిలో నిర్మించుకున్న షాపులను, డబ్బాలను రెవెన్యూ అధికారులు తొలగించారు. ఈ ఘటన శనివారం ఉదయం మండలంలోని వడపర్తి గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. వడపర్తి ప్రధాన రహదారి వెంట ప్రభుత్వ భూమిలో జీవనోపాధి కోసం గ్రామానికి చెందిన పలువురు డబ్బాలను, షాపులను ఏర్పాటు చేసుకున్నారు.
ఈ క్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆదేశాల మేరకు అక్రమంగా ప్రభుత్వ స్థలంలో షాపులు, డబ్బాలను నిర్వహించడం సరైంది కాదని, వెంటనే ప్రభుత్వ స్థలాన్ని ఖాళీ చేయాలని అధికారులు సూచించారు. శనివారం ఉదయం 5 గంటలకు జేసీబీలతో షాపులను తొలగించారు. విషయం తెలుసుకున్న బాధితులు తమ షాపుల వద్దకు వచ్చి బోరున విలపించారు. జీవనోపాధి కోసం షాపులను ఏర్పాటు చేసుకుంటే రెవెన్యూ అధికారులు తొలగించడం బాధాకరమన్నారు. రెవెన్యూ అధికారులపై చర్యలు చేపట్టాలని కోరుతూ బాధితులు ఆందోళన నిర్వహించారు. బాధితులతోపాటు, గ్రామస్తులు కూడా ఆందోళనలో పాల్గొన్నారు.