సంస్థన్ నారాయణపురం, మార్చి 12 : సీఎం రేవంత్‌రెడ్డిది ప్రజా పాలన కాదని, పాపిష్టి పాలన అని సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య గౌడ్ అన్నారు. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే మాజీ సర్పంచులను అక్రమంగా అరెస్టులు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. సంస్థన్ నారాయణపురం మండలంలోని పలువురు మాజీ సర్పంచులను, సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్‌ను బుధవారం పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ చర్యను నిరసిస్తూ ఆయన మాట్లాడారు.
పెండింగ్ బిల్లులు రాక ఎంతోమంది మాజీ సర్పంచులు అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులతో నిర్బంధాలతో సర్పంచులను వేధిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదని పాపిష్టి పాలన అని తీవ్రంగా విమర్శించారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో సర్పంచుల పెండింగ్ బిల్లులకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో త్వరలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. అరెస్టు అయిన వారిలో మాజీ సర్పంచులు దోనూరు శేఖర్ రెడ్డి, పాండురంగ నాయక్, మన్న చిత్రసేనా రెడ్డి, కట్టెల భిక్షపతి ఉన్నారు.