భువనగిరి కలెక్టరేట్, జూన్ 11 : సంక్షేమ పథకాల అమలులో పూర్తిగా విఫలమై ప్రతి చిన్న విషయానికి ఢిల్లీ పెద్దల నిర్ణయాలపై ఆధారపడి పరిపాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీఎం పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధి ప్రదాత, మాజీ సీఎం కేసీఆర్‌కు మద్దతుగా బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి బీఆర్కే భవన్ నుండి మాట్లాడారు. రాష్ట్రంలో అసమర్ధ పాలన కొనసాగుతుందన్నారు. కేసీఆర్ అంతటి గొప్ప వ్యక్తిని విచారణ పేరుతో పిలిపిస్తే తమ స్థాయి పెరుగుతుందని భ్రమలో ఉన్నారన్నారు. కాంగ్రెస్ పరిపాలన తీరుపై ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత వచ్చిందన్నారు.
రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెంది, పచ్చటి పంట పొలాలతో హరిత తెలంగాణే లక్ష్యంగా చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కాళేశ్వరమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్‌కు ఉన్న అనుభవం, పరిఙ్ఞానంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వెంట్రుక వాసి కూడా లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని కేసీఆర్‌ను విచారణ పేరుతో పిలవడం సిగ్గుచేటన్నారు. దేశం గర్వించదగ్గ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని నిర్మించి కేసీఆర్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారన్నారు. గులాబీ బాస్ వెంట యావత్ తెలంగాణ ప్రజలు, గులాబీ సైనికులు ఉన్నారని, ఎవరెన్ని కుట్రలు చేసినా ఆకాశంపై ఉమ్మి వేసిన చందంగా ఉంటుందన్నారు. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నిర్మాణంలో పిల్లర్ కుంగిన దాన్ని ప్రభుత్వం బూతద్దంలో చూస్తుందన్నారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ కట్టిన మిడ్‌మానేరు కుప్పకూలితే అడిగేనాథుడే లేరన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి బీఆర్ఎస్ ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడుతుందని, ఇది సరైన పద్దతి కాదన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం చావు నోట్లో తలపెట్టి సాధించిన మహాత్ముడు కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణకు కాళేశ్వరం గుండెకాయ అని అంతటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై లేనిపోని అపోహలు సృష్ఠిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన సమయంలో సరైన రీతిలో ప్రజలు బుద్దిచెప్పడం తధ్యమన్నారు. కేసీఆర్ వెన్నంటి గులాబీ దండు ఉంటుందని, ఈగ కూడా కేసీఆర్‌పైన వాలాలంటే సాహసం చేయాలన్నారు. రేవంత్‌రెడ్డి చేతకాని పరిపాలనకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పరిపాలనా అనుభవం లేకుండా పిచ్చోడి చేతిలో రాయి అన్న చందంగా రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తూ చిల్లర రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటని విమర్శించారు.