యాదగిరిగుట్ట, ఆగస్టు 21: ‘సారూ మాకు రుణమాఫీ రాలేదు.. మేం ఏడాది క్రితమే లక్షలోపు తీసుకున్నాం.. మా భార్య, కుమారుడు, నాపేరుతో రుణాలు తీసుకున్నాం. మాకు వస్తదా.. రాదా?’ అంటూ రైతన్నలు వ్యవసాయాధికారి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. బ్యాంకు అధికారులకు వద్ద వెళ్తే వ్యవసాయాధికారి కార్యాలయం వద్దకు వెళ్లమంటున్నారు.. ఏ అధికారీ సరైన సమాధానం చెప్పలేకపోతున్నారని రైతులు వాపోతున్నారు.
యాదగిరి గుట్ట పట్టణంలోని వ్యవసాయాధికారి కార్యాలయం వద్ద బుధవారం రైతులు క్యూ కట్టారు. తమకు రుణమాఫీ అమలు కాలేదని పట్టాదారు పాస్ పుస్తకంతోపాటు బ్యాంకు పాసు పుస్తకాలు తీసుకొని వచ్చారు. ఈ ఒక్కరోజే సుమారు 120 మంది రైతులు రుణమాఫీ కాలేదని దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు 250 మందికిపైగా రైతులకు రుణమాఫీ కాలేదని దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
ఇంకా చాలా మంది రైతులు బ్యాంకులు, వ్యవసాయాధికారి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గత ప్రభుత్వంలో ఏ ఒక్కరోజూ కార్యాలయాల చుట్టూ తిరుగలేదని, రుణమాఫీ చేస్తామని అరిగోస పెడుతున్నారని రైతులు వాపోతున్నారు. మండల వ్యాప్తంగా 11,765 రైతులుండగా వీరిలో దాదాపుగా 95 శాతం మంది రైతులు రుణమాఫీ తీసుకున్నవారిలో ఉంటారని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు.
వీరి లో కేవలం 3,844 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందని మండల వ్యవసాయాధికారి సుధారాణి తెలిపారు. మొదటి విడుతలో 1,987 మంది, రెండో విడుతలో 1,197 మంది, మూడో విడుతలో 660 మంది రైతులు రుణమాఫీ అమలైన లిస్టులో ఉన్నారని వెల్లడించారు. మిగతావారికి సాంకేతిక లోపంతో రుణమాఫీ అమలుకాలేదని తెలిపారు. రుణమాఫీ అమలుకాని రైతులు ఆధార్‌కార్డు, పట్టాదారు పాసుపుస్తకం, రుణం తీసుకున్న బ్యాంకు ఖాతా బుక్ జీరాక్స్లతో తమ గ్రామాల వ్యవసాయ విస్తరణాధికారులకు సమర్పించాలని సూచించారు.
79 వేల రుణం తీసుకుంటే మాఫీ కాలే
నాలుగేండ్ల క్రితం వ్యవసాయ అవసరాల కోసం సహకార బ్యాంకులో 79 వేలు తీసుకున్నా. మాకు 2.10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ప్రభుత్వం చెప్పిన ప్రకారం నాకు లక్షలోపు రుణమాఫీ కాలేదు. బ్యాంకు అధికారులను అడిగితే మాకు వచ్చిన లిస్టుల ద్వారా రుణమాఫీ ఇస్తున్నాం.. మాకేం తెలియదని సమాధానం ఇస్తున్నారు. వ్యవసాయ శాఖ కార్యాలయం వద్దకు వెళ్తే ఆధార్‌కార్డులో పేరు తప్పు, రేషన్ కార్డుతోపాటు ఇతర సాంకేతిక కారణాలతో రాకపోవచ్చని అంటున్నరు. దరఖాస్తు ఇచ్చి వెళ్లమంటున్నరు. రెండ్రోజులుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాను. ఇప్పటి ఏ అధికారి సరైన సమాధానం చెప్పడం లేదు. రుణమాఫీ వస్తుందో రాదోనన్న అనుమానం కలుగుతుంది. రైతులను ఇలా తిప్పడం కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచిది కాదు.
-ఎడపెల్లి పర్వతాలు, సైదాపురం, యాదగిరిగుట్ట మండలం
కొర్రీలు ఆపి రుణం మాఫీ చేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వం కొర్రీలు మానేసి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి రైతుకూ రెండు లక్షలు రుణమాఫీ చేయాలి. భువనగిరి సభలో లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా చెప్పిన మాట నిలబెట్టుకోవాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంట్లో ఎంతమందికి రుణం ఉన్నా మాఫీ చేసింది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా షరతులు లేకుండా మాఫీ చేయాలి. లేకపోతే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు. మా అమ్మకు నాకు కలిసి రూ. 2.60 లక్షల అప్పు ఉంది. మా ఇద్దరికి రుణమాఫీ చేయాలి. రుణమాఫీ కోసం వ్యవసాయాధికారులకు అడిగితే పైన ఉన్న రూ. 60 వేలు కట్టినాక మాఫీ వర్తిసుదని చెప్తున్నారు. రుణమాఫీ అయితదా లేదా అర్థంకావడం లేదు.
-బిల్లకుదురు రాజు, రైతు, రాజాపేట