భూదాన్ పోచంపల్లి, నవంబర్ 11 : ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, రుచికరమైన భోజనం అందించడం జరుగుతుందని, పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించారు. విద్యార్థులతో కలిసి కింద కూర్చొని భోజనం చేశారు. రోజు ఈ విధంగానే భోజనం పెడుతున్నారా, పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతిలో విద్యార్థుల గణిత సామర్ధ్యాన్ని ఆయన పరిక్షించారు. ఈ విద్యా సంవత్సరంలో వంద శాతం ఉత్తీర్తత సాధించాలని, ఎక్కువ మార్కులు వచ్చిన 250 మంది విద్యార్థులకు సైకిల్ అందజేస్తామని తెలిపారు. విద్యార్థులకు టాయిలెట్స్, వాటర్ పైప్ లైన్ కనెక్షన్లు ఇవ్వాలని ఆర్డబ్ల్యూఎస్ ను ఆదేశించారు. పాఠశాలలో నైట్ వాచ్మెన్ లేకపోవడంతో దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని దృష్టికి తీసుకురాగా పోలీసులు పెట్రోలింగ్ చేయాలని కలెక్టర్ సూచించారు.
అనంతరం జూలూరు పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, గతంలో 2.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. ధాన్యo కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని, లారీలు టార్పాలిన్ కవర్స్, గన్ని బ్యాగుల కొరత లేదన్నారు. ట్యాబ్ ఎంట్రీ చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయని, ఇప్పటివరకు జిల్లాలో రూ.30 కోట్లు రైతుల ఖాతాలో జమ అయ్యాయని తెలిపారు. ఆరుగాలం కష్టపడి రైతన్నలు తమ ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్మవద్దని, చివరి గింజ వరకు ధాన్యo కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్య పడవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమిషనర్ అంజన్ రెడ్డి, ఎంపీడీఓ రాపర్తి భాస్కర్ గౌడ్, ఎంఈఓ ప్రభాకర్, ఎం ఆ ర్ ఐ గుత్తా వెంకటరెడ్డి, జడ్.పి.హెచ్.ఎస్ ప్రధానోపాధ్యాయుడు కిష్టయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Bhoodan Pochampally : ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య : కలెక్టర్ హనుమంతరావు