భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 15 : పింఛన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నాయకులు, వృద్ధులు భూదాన్ పోచంపల్లి మండల తాసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తాసీల్దార్ శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా నాయకుడు యాకరి నర్సింగరావు మాట్లాడుతూ.. ఎన్నికల్లో కాంగ్రెస్ పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చి నేటికీ అమలు చేయలేదని ఆరోపించారు. మాయ మాటలతో కాలయాపన చేస్తూ మోసం చేస్తున్నారని, పింఛన్లు పెంచకపోతే ముఖ్యమంత్రిని గద్దె దించుతామని హెచ్చరించారు.
వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత కార్మికులకు రూ.4 వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. పింఛన్లు పెంచకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జి సందెల శ్రీనివాస్, వీహెచ్పీఎస్ మండల ఇన్చార్జి మల్యాల మధు, మండల అధ్యక్షుడు ఏర్పుల శివయ్య, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కోతులారం యాదగిరి, మాజీ సర్పంచ్ శాపాక భిక్షపతి, నాయకులు మీసాల నరసింహ, ముఠాపురం రాములు, బొచ్చు అనిల్ కుమార్, కాసుల సత్యనారాయణ, కొడిసల వెంకటేశ్, రాములు, ఎల్లయ్య పాల్గొన్నారు.