ఖిలావరంగల్ : రాబోయే రబీ సీజన్ ( Rabi season ) కు సంబంధించి ధాన్యం సేకరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు ముందస్తు సన్నాహాలు పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద ( Collector Dr. Satya Sharada ) సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఆదివారం జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి పౌర సరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రబీ 2025-26 ధాన్యం సేకరణ, 2024-25 సీఎంఆర్( CMR ) డెలివరీ, ప్రజా పంపిణీ వ్యవస్థ అమలు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ల నుంచి, బ్యాంక్ గ్యారంటీ పత్రాల సమర్పణ తదితర అంశాలపై సమీక్షించి అవసరమైన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 2025-26 రబి సీజన్లో సుమారు 2 లక్షల 10 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు అయ్యే అవకాశం ఉందని అంచనా ఉన్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సుమారు 240 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ధాన్యం సేకరణ ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలన్నారు. 2024-25 రబీ సీఎంఆర్‌ను 100 శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఖరీఫ్ 2025-26 సీఎంఆర్ డెలివరీ వేగవంతం చేయాలన్నారు. గోదాముల్లో ఉన్న ధాన్యం నిల్వలను అధికారులు నిరంతరం పరిశీలించాలని తెలిపారు. రైస్ మిల్లర్ల నుంచి బ్యాంక్ గ్యారంటీ పత్రాలను తప్పనిసరిగా సేకరించాలని ఆదేశించారు. రాబోయే వచ్చేనెల రెండవ వారంలో రబీ ధాన్యం కొనుగోలు ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నందున, మార్కెటింగ్ శాఖ ద్వారా అవసరమైన టార్పాలిన్లు, మాయిశ్చర్ మీటర్లు, వేయింగ్ మిషన్లు, ప్యాడీ క్లీనర్లు, డ్రయర్లు తదితర సామగ్రిని ముందుగానే సమకూర్చుకుని సిద్ధంగా ఉండాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్డీవో రామ్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి కిష్టయ్య, జిల్లా మేనేజర్ సంధ్యారాణి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి మనోహర్, జిల్లా కోఆపరేటివ్ అధికారి నీరజ, సంబంధిత శాఖల అధికారులు, జిల్లాలోని రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.