Raj Gopal Reddy | మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్‌లో కలవరపెడుతున్నది. కొంతకాలంగా మంత్రి పదవి కోసం పట్టుబడుతున్న ఆయన.. ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీక్రెట్ డిన్నర్ మీటింగ్ పెట్టారు.
ఒకేసారి 15 మంది ఎమ్మెల్యేలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆహ్వానం పంపగా.. గురువారం సాయంత్రం మహబూబ్‌నగర్, వరంగల్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 9 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా హాజరైనట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణలో తనకు మంత్రి పదవి దక్కకుండా అడ్డుకుంటున్నారని.. కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే సీక్రెట్ డిన్నర్ మీటింగ్ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఈ రహస్య డిన్నర్ మీటింగ్‌పై రాజకీయ వర్గాల్లో భారీ చర్చ మొదలైంది.
అసలు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరబోతున్నారనే ప్రచారం నుంచి కోలుకోకముందే.. ఈ 9 మంది ఎమ్మెల్యేల సమావేశం కాంగ్రెస్‌కు మరో షాక్‌గా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మీటింగ్ కొత్త రాజకీయ సమీకరణాలకు సంకేతమా? లేక పెద్ద రాజకీయ కుదుపునకు నాందా? అని చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే రాజగోపాల్ రెడ్డి కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గుచూపుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో తదుపరి రాజకీయ పరిణామాలపై ఉత్కంఠ పెరుగుతోంది.