సంస్థాన్ నారాయణపురం, ఫిబ్రవరి 20 : యూరియా కోసం పడుతున్న బాధలు చూస్తుంటే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందని రైతు దామోదర్‌రెడ్డి అన్నారు. తనకు చదువు రాదని, ఓటీపీ అంటే ఏమిటో తెలవదని, ఫోన్లో యూరియా బుక్ చేయడం వస్తలేదని, ఇగ తనకు యూరియా దొరికేదెట్లా అని వాపోయాడు. చదువు రాని, ఫోన్లు వాడటం రాని తమలాంటి రైతులకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఫర్టిలైజర్ యాప్ శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు. సంస్థాన్ నారాయణపురం మండలంలోని సర్వేలు గ్రామంలో రైతు ఉత్పతిదారుల సంస్థ యూరియా కోసం ఆన్లైన్లో బుకింగ్ ఓపెన్ చేసింది. అక్కడికి వచ్చిన రైతులకు ఓటీపీలు రాకపోవడం, ఆండ్రాయిడ్ ఫోన్ లేకపోవడంతో యూరియా దొరకక పోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యాప్ ఓపెన్ చేసిన క్షణాల్లో స్టాక్ అయిపోతుందని రైతులకు యూరియా కూడా ఇవ్వలేని చేతగాని ప్రభుత్వం ఉండడం తాము చేసుకున్న దౌర్భాగ్యం అని రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. ఒక్క యూరియా బస్తా కోసం పడరానీ పాట్లు పడుతున్నామని అక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. యూరియా యాప్ ను తీసేయాలని, గతంలో ఇచ్చిన విధంగానే యూరియా అందించాలని రైతులు డిమాండ్ చేశారు.

‘యూరియా కష్టాలు చూస్తుంటే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది’