కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. బహుశా, దేశంలో ఈ ప్రాజెక్ట్ మీద జరుగుతున్నంత రాజకీయ ప్రేరేపిత చర్చ ఏ ప్రాజెక్టుపైనా జరుగలేదేమో! ఇలాంటి చర్చకు దగ్గరలో ఉన్నది సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్, పోలవరం ప్రాజెక్ట్. సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ విషయంలో చర్చ ఎక్కువగా పర్యావరణ అంశాలు, ముంపు ప్రభావిత ఆదివాసీల మనుగడపై జరిగాయి. పర్యావరణ సమస్యలు దాటుకుని పోలవరం నిర్మాణం పనులు జరుగుతున్నాయి. అయితే కాళేశ్వరం, పోలవరం ప్రాజెక్ట్‌లపై చర్చల్లో తేడా ఏందంటే, పోలవరం ప్రాజెక్టుపై రాజకీయ పార్టీల మధ్య భేదాభిప్రాయాలు లేవు. అవినీతి, పనుల్లో ఆలస్యం లాంటి ఆరోపణలు విన్నాం. కానీ, పోలవరం అవసరం లేదని ఏ రాజకీయ పార్టీ చెప్పలేదు. కాంగ్రెస్ మొదలు పెట్టిన ప్రాజెక్టును ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ, వైసీపీ కొనసాగించాయి.
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తున్నది. జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు టీడీపీ, వైసీపీ పోలవరం నిర్మాణం పూర్తవడానికి కృషి చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక, రాజకీయ సహకారం కూడా ఉన్నాయి. ఎన్నిసార్లు పోలవరం పనులు వర్షాల్లో కొట్టుకుపోయినా ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థలు వచ్చి ప్రాజెక్ట్ పనులను ఆపలేదు. అవినీతి, నాసి రకం పనులు అని, నిజాలు తేలేవరకు లేదా రాజకీయ ఫలితాలు వచ్చే వరకు ప్రాజెక్ట్ పనులను నిలుపలేదు. అన్ని పార్టీల వారు రాజకీయాలు పక్కన పెట్టి రైతుల కోసం ఆలోచిస్తున్నారు. కానీ కాళేశ్వరం విషయంలో మాత్రం రాజకీయ ప్రకటనలు చూస్తున్నాం.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నుంచి అది వాడుకలోకి వచ్చేంత వరకు కూడా ప్రత్యర్థి రాజకీయ పార్టీలు కాళేశ్వరంపై వ్యతిరేకతను వదిలిపెట్ట లేదు. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ప్రస్తుత సీజన్లో ప్రభుత్వం నంది మేడారం పంపులు నడిపించక తప్పలేదు. ఇక్కడే కొత్త సమస్య మొదలయింది. నంది మేడారం పంపులు నీళ్లను ఎత్తి పోయడం మొదలుపెట్టడం కాళేశ్వరం వ్యతిరేకులకు నచ్చలేదు. ఇంతకాలం కాళేశ్వరం కొట్టుకుపోయిందంటూ చేసిన ఆరోపణలకు విరుద్ధంగా నంది మేడారం పంపుల ద్వారా నీళ్లు ఎత్తిపోస్తున్నారు. దీన్ని ఎలాగయినా వక్రీకరించాలని, కాళేశ్వరం ప్రాజెక్టుకు క్రెడిట్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో కొత్త వాదన అందుకున్నారు.
ఎల్లంపల్లి జలాశయం ప్రాణహిత-చేవెళ్లలో భాగమని, దీనికి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం లేదని వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం లేకుండా ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్ట్ 2014 కంటే ముందే పూర్తయిందా? పూర్తయితే 2014కు ముందే తెలంగాణ బీళ్లకు నీళ్లు ఎందుకు మళ్లలేదు? కాళేశ్వరం పూర్తయిన తర్వాతే తెలంగాణలో వ్యవసాయ అభివృద్ధి ఎందుకు జరిగింది? వరి సాగు, ధాన్యం సేకరణలో దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో ఎలా నిలిచింది? ఈ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి కొన్ని వాస్తవాలను పరిశీలించాలి.
2010లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహితచేవెళ్ల పథకం కోసం డీపీఆర్ ఇచ్చింది. తమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత నది నుంచి 160 టీఎంసీల నీటిని ఎల్లంపల్లికి ఎత్తి, తెలంగాణలో 1620 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని వాగ్దానం చేసింది. 1,055 కిలోమీటర్ల కాలువలు, సొరంగాలు, కాలువల వెంబడి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, చేవెళ్ల దగ్గర టెర్మినల్ రిజర్వాయర్ నిర్మిస్తామని డీపీఆర్‌లో రాశారు. మరి 2014 నాటికి ఆ ప్రణాళికలు ప్రాజెక్టుల రూపంలో ప్రజల ముందుకు వచ్చాయా? అనే విషయం లోతుగా పరిశీలిద్దాం. 2014 కన్నా ముందు తమ్మిడిహట్టి దగ్గర ఎటువంటి పనులు మొదలు పెట్టలేదు. ఎందుకంటే మహారాష్ట్ర ఒప్పుకోలేదు, కేంద్రం నుంచి ఎటువంటి అనుమతులూ రాలేదు.
ఎల్లంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు మాత్రమే మొదలు పెట్టారు. కానీ అవి కూడా 2014 నాటికి కేవలం 60 శాతం మాత్రమే పూర్తయ్యాయి. ఇక ఎల్లంపల్లి నుంచి నీళ్లను పైకి ఎలా తీసుకువెళ్లాలి అనే విషయంపై డీపీఆర్‌లో స్పష్టత లేదు. ఎల్లంపల్లి ద్వారా చేవెళ్ల వరకు నీళ్లు తరలించే మార్గంలో అవసరమైన కొన్ని రిజర్వాయర్ల పేర్లు ఈ డీపీఆర్‌లో సూచించారు. కానీ వాటి నిల్వ సామర్థ్యాలు, ప్రతి రిజర్వాయర్ నుంచి నీళ్లు ఎత్తి పోయడానికి కావలసిన కాలువలు, పంపింగ్ స్టేషన్లు, ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్లు, భూసేకరణ ప్రణాళికలు, పునరావాసం లాంటి ముఖ్యమైన అంశాలు ఎక్కడా ప్రస్తావించలేదు.
ప్రతీ దశకు అయ్యే ఖర్చు వివరాలు కూడా లేవు. కొన్ని ప్యాకేజీలకు ఇచ్చిన అడ్వాన్సులు తప్ప పూర్తి పనులకు నిధులు కేటాయించలేదు. ఇది కేవలం ఒక సాధారణ ఇంజినీరింగ్ రూపకల్పనలాగా త యారు చేసిన ప్రణాళిక. ప్రాణహితచేవెళ్ల పథకం ఒక రాజకీయ అ స్త్రంగా పనికొచ్చింది తప్పితే రైతులకు ప్రయోజనం జరిగినట్టు కనపడదు. తమ్మిడిహట్టి దగ్గర పని జరుగలేదు. ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోయడానికి అవసరమైన పనులు కూడా జరగలేదు. 2014 వరకు ఈ ప్రణాళిక ఒక వాగ్దానంగానే మిగిలిపోయింది. 2014 తర్వాత పరిస్థితి మారింది. ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం దీనిని కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌గా మార్చింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను చేర్చారు. కాళేశ్వరంలో భాగంగా అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, మల్కపేట, బస్వాపూర్, రిజర్వాయర్లను నిర్మించారు. పంపింగ్ స్టేషన్లు, సబ్ స్టేషన్లు నిర్మించారు, కాలువలు తవ్వారు.
భూసేకరణ పూర్తయింది. ముఖ్యంగా అన్ని రకాల అనుమతులు తెచ్చారు. అట్లాగే వివిధ కోర్ట్ కేసులు కూడా సమర్థవంతంగా ఎదుర్కొనన్నారు. అబ్బురపడే విషయం ఏంటంటే ఇవన్నీ చేయడానికి కేవలం మూడేండ్లు మాత్రమే తీసుకున్నది. బహుళ ప్రాంతాల్లో, బహుళ వనరులతో నడిచే ఒక ప్రాజెక్టును ఇంత త్వరగా పూర్తి చేయడం ఒక అద్భుతమే. ఈ అంశాలను పరిశీలిస్తే రైతులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏందంటే, 2014 కన్నా ముందు ప్రణాళికలు కాగితాల వరకే పరిమితమయ్యాయి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 తర్వాతనే రైతుల మేలు కోరి సొంత రాష్ట్రంలో పనులు పరుగెత్తాయి. రైతుల కలలు సాకారమయ్యాయి.
ప్రాణహితచేవెళ్ల పథకం కేవలం ప్రణాళికగానే మిగిలిపోగా, కాళేశ్వరం ద్వారా ఎల్లంపల్లి నుంచి గోదావరి నీళ్లు తెలంగాణ బీళ్లకు మళ్లాయి. ఈ వాస్తవాలు ప్రజలు, రైతులు గ్రహించాలి. ఇప్పుడు కాంగ్రెస్ పాలకులు చెప్తున్నట్టు ఎల్లంపల్లి నుంచి ఎత్తి పోస్తున్న గోదావరి నీళ్లు, 2014 తర్వాత కట్టిన పుంప్ హౌస్‌లు, కాలువలు, రిజర్వాయర్ల ద్వారా వచ్చినవే. అంతేకానీ కాగితాల నుంచి పొలాల్లోకి రాలేదు. నాయకుల దార్శనికత, ఇంజినీర్ల పట్టుదల, అధికారుల సమర్థత, కార్మికుల శ్రమ ఫలితమే ఎల్లంపల్లి నుంచి గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నది.



– చంద్రి రాఘవరెడ్డి