Suryapet | పెన్‌పహాడ్, సెప్టెంబరు 16 : సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండల కేంద్రానికి చెందిన మాజీ మార్కెట్ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నేత వారసులకు చెందిన వెంకటసాయి రైస్‌మిల్‌లో రూ.23.80 కోట్ల విలువైన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) వ్యవహారంలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీంతో విజిలెన్స్, సివిల్ సప్లై అధికారులు మిల్లును సీజ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వెంకటసాయి రైస్‌మిల్‌లో 2023-24, 2024-25, 2025-26 సంవత్సరాలకు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) వ్యవహారంపై విజిలెన్స్, సివిల్ సప్లై అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రూ.23.80 కోట్ల విలువైన సీఎంఆర్‌కు సంబంధించి అవకతవకలు జరిగినట్లు గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు.
తనిఖీల అనంతరం మిల్లును అధికారులు సీజ్ చేశారు. ఈ వ్యవహారంపై జిల్లా సివిల్ సప్లై మేనేజర్ శ్రీధర్‌రెడ్డి ఈ నెల 13న పెన్‌పహాడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ ప్రసన్నకుమార్ పర్యవేక్షణలో ఎస్ఐ బాలు నాయక్ కేసు నమోదు చేశారు.
మిల్ యజమానులుగా ఉన్న తూముల భుజంగరావు వారసులు తూముల విజయ్, ఆయన కోడలు, మాజీ సర్పంచ్ తూముల శ్వేతపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీఎంఆర్ వ్యవహారంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు కొనసాగుతోందని ఎస్ఐ బాలు నాయక్ పేర్కొన్నారు.