సిద్దిపేట, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): “స్వాతంత్య్ర దినోత్సవం రోజు భారతదేశంలో ఏ సీఎం ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడరు. సంగారెడ్డికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు ఎదురొంటున్న ప్రధాన సమస్యలపై మాట్లాడకుండా రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారు” అని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. శనివారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో 420 హామీలు ఇచ్చి సంగారెడ్డి సభలో సీఎం నాలుగు గంటల 20 నిమిషాలకు ప్రసంగం ప్రారంభించి పూర్తిగా 420 మాటలే మాట్లాడారని విమర్శించారు.
పీఎం రేవంత్‌రెడ్డి ఘరానా మోసగాడు అని మండిపడ్డారు. సింగూరు తాగునీరు, సంగమేశ్వర-బసవేశ్వర ప్రాజెక్టు, రహదారులు, జహీరాబాద్ ప్రాంత సమస్యలు, నారాయణఖేడ్ తాగునీటి సమస్య, పెండింగ్ అభివృద్ధి పనులపై సీఎం స్పష్టమైన హామీలు ఇవ్వలేదన్నారు. సంగారెడ్డి జిల్లాకు ఒక కొత్త రూపాయి హామీ ఇచ్చారా? ఒక ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారా? ఒక కొత్త రోడ్డు మంజూరు చేస్తామని చెప్పారా? తాగునీటి సమస్య పరిషారానికి ప్రత్యామ్నాయ చర్యలు ప్రకటించారా? ప్రజల సమస్యలపై ఒక మాట చెప్పకుండా రాజకీయ విమర్శలు చేయడం ఎందుకు? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి ముందుగా గతంలో ఇచ్చిన హామీల అమలుపై సమీక్షించాలని హితవుపలికారు. రోడ్లు అధ్వానంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన సంగమేశ్వర-బసవేశ్వర ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హరీశ్‌రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి సంగారెడ్డి జిల్లాకు వచ్చిన సందర్భంగా ప్రాజెక్టు పనులను ఎప్పుడు పూర్తిచేస్తారో? ఎప్పుడు నీటిని అందిస్తారో స్పష్టమైన గడువు ప్రకటించలేదని మండిపడ్డారు. ఏడాది క్రితం సీఎం జహీరాబాద్‌కు వచ్చి హామీలు ఇచ్చారని, వాటిలో ఎన్ని అమలయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి, నారాయణఖేడ్ , అందోల్, జహీరాబాద్ ప్రాంతాల్లో రహదారులు అధ్వానంగా మారాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో మంజూరై టెండర్లు పూర్తయిన పను లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుకు సాగడం లేదని ఆరోపించారు.
రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నామని ప్రభుత్వం చేస్తు న్న ప్రకటనలపైన హరీశ్‌రావు తీవ్రంగా స్పం దించారు. సిద్దిపేట మండలం రాఘవాపూర్, మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రాంతాల్లోని సబ్స్టేషన్లను సందర్శించి లాగ్‌బుక్ పరిశీలించినట్లు తెలిపారు. రైతులకు త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా 10 నుంచి 11 గంటలకే పరిమితమైందని ఆరోపించారు. 24 గంటల కరెంట్ ఎకడ వస్తుందో చూపించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. సబ్స్టేషన్ల వద్ద రైతులు విద్యుత్ సమస్యలపై ఆందోళనలు చేస్తున్నారన్నారు.
ఎరువుల సరఫరా విషయంలోనూ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. నంగునూరు మండలం నర్మెట, వెంకటాపూర్ గ్రామాలకు చెంది న రైతులు యూరియా కోసం ఆన్లైన్లో బుక్ చేసుకునే సమయంలో తమ గ్రామాల పేర్లు యాప్‌లో కనిపించడం లేదని ఫిర్యాదు చేశారన్నారు. యూరియా ధర పెరిగినా సరైన సమయంలో సరఫరా కావడం లేదని, డీఏపీ అందుబాటులో లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. డీడీలు చెల్లించి విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులు ఎదురు చూస్తున్నారన్నారు. ట్రాన్స్ఫార్మర్లు, కేబుల్స్, ఇతర విద్యుత్ సామగ్రి కొరత కారణంగా కనెక్షన్లు ఇవ్వలేకపోతున్నామని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మాజీ మున్సిపల్‌చైర్మన్ రాజనర్సు, నాయకులు రమేశ్‌గౌడ్, ప్రభాకరవర్మ తదితరులు పాల్గొన్నారు.