ప్రశ్నించిన జర్నలిస్టులను దూషించడం దుర్మార్గం : ఎర్రోళ్ల
హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పచ్చి అబద్ధాలకోరని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తీవ్రస్థాయి లో విరుచుకుపడ్డారు. పార్లమెంట్ మెంబర్ అయిఉండి వార్డు మెంబర్ కంటే అధ్వానంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జర్నలిస్టులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం పోరాడిన కేటీఆర్, హరీశ్‌రావును ఉద్దేశించి నోటికొచ్చినట్లు మాట్లాడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. అహంకారంతోనే అలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ మొత్తం తన సామ్రాజ్యమని భావించి కారుకూతలు కూస్తున్నారని విమర్శించారు. అర్వింద్ పేరు వింటేనే వికారం పుడుతుందని ఎద్దేవా చేశారు. శనివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ సీనియర్ నేతలు గోసుల శ్రీనివాస్ యాదవ్, బొమ్మెర రామ్మూర్తి, స్వామియాదవ్, శరత్, సాయితేజతో కలిసి విలేకరులతో ఎర్రోళ్ల మాట్లాడారు. అర్వింద్ లాంటి వాళ్లు చిల్లర భాషతో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మంత్రి ఫొటో ఎందుకు?: గెల్లు
ప్రభుత్వం జారీ చేస్తున్న స్మార్ట్ కార్డుల్లో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఫొటో ముద్రించడం ఎంతవరకు సమంజసమని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ప్ర శ్నించారు. స్కామ్‌లకు తెరలేపిన మంత్రి ఫొటోను ముద్రించడం బాధాకరమన్నారు.
రాజ్యాంగమంటే బీజేపీకి లెక్కలేదు: సుమిత్ర
రాజ్యాంగమన్నా, నైతిక విలువలన్నా బీజేపీ నేతలకు లెక్కేలేదని టీజీపీఎస్సీ మాజీ మెంబర్ సుమిత్రా ఆనంద్ విమర్శించారు. బీజేపీ ఎంపీలు మురికి భాష మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 8 మంది ఎంపీలను గెలిపిస్తే ఏం సాధించారని దెప్పిపొడిచారు.