– అందరికీ లబ్ది చేకూరే విధంగా హెల్త్ కార్డులు
– విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకట్ రెడ్డి
కోదాడ, జూన్ 30 : ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు త్వరలోనే మంచి ఫిట్మెంట్తో పీఆర్సీ రాబోతుందని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య ఆహ్వానం మేరకు కోదాడ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో జరిగిన సామూహిక జన్మదిన వేడుకలు, జిల్లాస్థాయి క్రీడా సాంస్కృతిక పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. హెల్త్ కార్డ్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పిఆర్సి, సిపిఎస్ వంటి తమ ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ఒప్పుకున్నదని, త్వరలోనే అవి కార్యరూపం దాల్చనున్నాయన్నారు.
కోదాడ విశ్రాంత ఉద్యోగుల సంఘం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నదని కొనియాడారు. అనంతరం జూన్ నెలలో జరుపుకునే విశ్రాంత ఉద్యోగుల జన్మదిన వేడుకలను సామూహికంగా నిర్వహించారు. జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో గెలిపించిన విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కోదాడ యూనిట్ అధ్యక్షుడు వేనేపల్లి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు బొల్లు రాంబాబు, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ప్రహల్లాద రావు, ఉపాధ్యక్షులు శంకర్ రెడ్డి, దండా మధుసూదన్ రెడ్డి, కార్యదర్శి పందిరి రఘువర ప్రసాద్, ఆర్థిక కార్యదర్శి తమ్మనబోయిన వీరబాబు, ఉపాధ్యక్షులు యస్దాని, బాలేమియా, బ్రమరాంబ, భూపాల్ రెడ్డి, వరకాల జానయ్య, వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు ఖమ్మం జిల్లా సంఘ సభ్యులు పాల్గొన్నారు.