Canada : కెనడాలో కార్చిచ్చు విజృంభిస్తోంది. కొద్ది రోజులుగా బ్రిటీష్ కొలంబియా ప్రాంతంలో కొనసాగుతున్న కార్చిచ్చు మరింత వేగంగా విస్తరిస్తోంది. వేల ఎకరాల అడవి తగలబడిపోతోంది. దీంతో కెనడా ప్రభుత్వం బ్రిటీష్ కొలంబియాలో ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ ప్రాంతంలోని 20,000 మందిని సురక్షిత ప్రాంతాలకు వెంటనే తరలివెళ్లాలని ఆదేశించింది. బాధితుల్ని రక్షించే సహాయక చర్యల్ని కొనసాగిస్తోంది. కార్చిచ్చు వేగంగా విస్తరిస్తుండటం వల్ల బ్రిటీష్ కొలంబియాలో ఎమర్జెన్సీ ప్రకటించామని అధికారులు తెలిపారు.
అక్కడి అధికారుల వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 100 అడుగులు (30 మీటర్లు) ఎత్తులో మంటలు ఎగసిపడుతున్నాయి. ఇవి 200 అడుగుల వరకు కూడా చేరుకునే అవకాశం ఉంది. పైగా ఈ మంటలు కృత్రిమ వాతావరణాన్ని సృష్టించి, మెరుపులు ఏర్పడేలా కూడా చేస్తుంది. కార్చిచ్చు విస్తరిస్తుండటంతో ఇప్పటికే భారీ ఆస్తి నష్టం జరిగింది. అనేక ఇళ్లు, కార్లు, ఆస్తులు కాలి బూడిదయ్యాయి. కొన్నిచోట్ల మంటలు వేగంగా వ్యాపించడంతో చాలా మంది మధ్యలో చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం కొన్నిచోట్ల మంటలు మొదలవ్వగా, అర్ధరాత్రి వరకు భారీగా వ్యాపించాయి. శనివారం ఒక్క రోజే 9,500 హెక్టార్ల (23,500 ఎకరాలు)కు మంటలు వ్యాపించాయి. దీంతో 12,000 మంది పౌరులు ఇక్కడినుంచి తరలి వెళ్లాల్సి వచ్చింది. ముఖ్యంగా సమ్మర్ల్యాండ్లో మొదలైన కార్చిచ్చు చాలా ప్రమాదకరంగా మారింది.
గత వారం నుంచి ఇక్కడ 70 చోట్ల కార్చిచ్చు వ్యాపించింది. అంతకుముందు వాటితో కలిపి 105 చోట్ల కార్చిచ్చు కొనసాగుతోందని బ్రిటీష్ కొలంబియా అటవీ శాఖ మంత్రి రవి పర్మార్ ప్రకటించారు. ఈ ఏడాదిలో కెనడాలో అనేకచోట్ల కార్చిచ్చు వ్యాపించి, భారీ నష్టాన్ని కలిగించింది. 2026లో 4 మిలియన్ల హెక్టార్లలో కార్చిచ్చు వ్యాపించి, వినాశనం సృష్టించింది. ముఖ్యంగా ఒంటారియో, క్యూబెక్ వంటి వేడిగా, పొడిగా ఉండే ప్రదేశాల్లోని అటవీ ప్రాంతాలు తగలబడిపోయాయి. కొన్నేళ్లుగా దేశంలో కార్చిచ్చు ఘటనలు ఎక్కువగా జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.