భువనగిరి కలెక్టరేట్, మార్చ్ 8: కరువు తీవ్రతతో ఎండిన వరి పంటను భవనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి (Pailla Shekar Reddy) పరిశీలించారు. అన్నదాతల ఆక్రందనలు ప్రభుత్వానికి పట్టడం లేదని దుయ్యబట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కరువు ఎక్కువ అవ్వడంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోయాయని చెప్పారు. శనివారం ఉదయం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డితో కలిసి భువనగిరి మండలంలోని హన్మాపురం, మన్నె వారి పంపు, వడపర్తి, హనుమాపురం, చందుపట్ల, బండ సోమవారం, గౌస్ నగర్, ఎర్రంపల్లి, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో వరి పొలాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో కరువు కోరలు తాండవిస్తున్నాయన్నారు. కేసీఆర్ హయాంలో సస్యశ్యామలమైన పంటచేలు.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో నెర్రెలు పారేయన్నారు. అన్నదాత ఆక్రందనలు ప్రభుత్వానికి పట్టడం లేదని దుయ్యబట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కరువు ఎక్కువ అవ్వడంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోయాయని అన్నారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత నానాటికి అధికమవుతున్నదని చెప్పారు. రైతుల పక్షాన ముందుండి పోరాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సంసిద్ధంగా ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం తధ్యమని, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన రీతిలో బుద్ధి చెప్పడం తధ్యమన్నారు.