భూదాన్ పోచంపల్లి, మార్చి 27 : జిల్లా కేంద్రానికి వెళ్లే రహదారి గుంతలమయమై వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని, కావునా రోడ్డు మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలని సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నరసింహ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో గురువారం భూదాన్ పోచంపల్లి మండలం పెద్ద రావులపల్లి నుండి రేవనపల్లి, పోచంపల్లి వరకు పాదయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, అద్వానమైన రోడ్లను వెంటనే బాగు చేయాలని కోరారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అర్హులందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి కోట రామచంద్రారెడ్డి, మండల కార్యదర్శి వర్గ సభ్యుడు మంచాల మధు, ప్రసాదం విష్ణు, నాయకులు దుబ్బాక జగన్, వడ్డేపల్లి యాదగిరి పాల్గొన్నారు.