యాదగిరిగుట్ట, మార్చి 31 : రాష్ట్రంలో రేవంత్రెడ్డి పాలన గాడితప్పి రైతులు, మహిళలు, యువతీయువకులు హరిగోస పడుతున్నారని, మళ్లీ కేసీఆర్ సర్కార్ వస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని బీఆర్ఎస్ పార్టీ యాదగిరిగుట్ట మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య అన్నారు. ”సీఎంగా కేసీఆరే రావాలి” అంటూ ఏప్రిల్ 4వ తేదీన పట్టణ యువజన నాయకులు ముక్కర్ల సతీశ్, ఆవుల సాయియాదవ్ ఆధ్వర్యంలో గుట్ట నుంచి ఎర్రవెల్లి కేసీఆర్ స్వగృహానికి సుమారు వెయ్యి మంది రైతులు, యువకులు పాదయాత్రగా వెళ్లనున్నట్లు తెలిపారు. సోమవారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 4న స్వామి దర్శనం అనంతరం వైకుంఠ ద్వారం వద్ద పాదయాత్రను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి ప్రారంభించనున్నట్లు చెప్పారు. పాదయాత్రలో ఆలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొననున్నట్లు వెల్లడించారు. కేసీఆర్ను కలిసి నియోజకవర్గంలోని కరువు, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వివరించనున్నట్లు చెప్పారు. రూ.2 వేల కోట్లతో యాదగిరిగుట్టను ప్రపంచమే గర్వపడే విధంగా కేసీఆర్ పునర్నిర్మించినట్లు తెలిపారు.
పునర్నిర్మాణంలో భాగంగా స్వామివారి దివ్య విమాన గోపురాన్ని 120 కేజీల బంగారంతో స్వర్ణమయం చేయాలని సంకల్పించారన్నారు. సీఎంగా కేసీఆర్తో పాటు ఇతర మంత్రులు, దాతలు అందజేసిన విరాశాలు సమారుగా వంద కిలోల బంగారం సమకూరిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, ఈఓ భాస్కర్రావు కలిసి కేవలం 10 కిలోల బంగారమే వచ్చిందని మిగతా 50 కిలోల బంగారాన్ని స్వామివారి ఖాజానా నుంచి నిధులను సేకరించి కొనుగోలు చేసి 80 కిలోల బంగారంతో విమాన గోపురాన్ని బంగారు తాపడం చేశారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు విరాళాలకు సంబంధించిన వివరాలు చెప్పలేదన్నారు. ఈఓ భాస్కర్ రావు ఒక్కడే వెళ్లి బంగారాన్ని కొనుగోలు చేశారని చెప్పడం అనుమానాలకు తావిస్తోందన్నారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక యాదగిరిగుట్ట ఆలయం ఆధ్వానంగా మారిందన్నారు. భక్తులకు పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ కలిసి పీఆర్ వ్యవస్థను ఏర్పాటు చేసి భక్తులను దోచుకుంటున్నారని ఆరోపించారు. కొండపైన పెండింగ్లో ఉన్న 5 శాతం పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయన్నారు. బడ్జెట్లో దేవస్థానానికి ఒక్క రూపాయి కేటాయించకుండా స్వామివారి ఆదాయాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలంతా మరోసారి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు, ఇదే అంశాన్ని కేసీఆర్ ను కలిసి రైతులు వివరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, బీఆర్ ఎస్ పట్టణ సెక్రటరి జనరల్ పాపట్ల నరహరి, యువజన విభాగం అధ్యక్షుడు ముక్యర్ల సతీశ్యాదవ్, నాయకులు కోన్యాల నర్సింహారెడ్డి, గుండ్లపల్లి వెంకటేశ్ గౌడ్, దేవపూజ ఆశోక్, కారాజీ రాజేశ్ యాదవ్ పాల్గొన్నారు.