భూదాన్ పోచంపల్లి, అక్టోబర్ 09 : చేనేత సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా ఉద్యమించాలని చేనేత జన సమాఖ్య జాతీయ అధ్యక్షుడు మాచర్ల మోహన్ రావు పిలుపునిచ్చారు. గురువారం భూదాన్ పోచంపల్లిలో జిల్లా చేనేత జన సమాఖ్య ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు, చేనేత సంస్థల ప్రతినిధులతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత రుణ మాఫీని చేస్తామని ప్రకటించి 13 నెలలు గడిచినా నేటికీ అమలుకు నోచుకోలేదన్నారు. రుణమాఫీ కోసం కార్మికులు ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత వస్త్రాలపై జీరో జీఎస్టీ విధానాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. చేనేత సహకార సంఘానికి ఎన్నికలు నిర్వహించాలని, సంఘాల్లో పేరుకుపోయిన వస్త్ర నిల్వలను ప్రభుత్వం కొనుగోలు చేసి కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు.
నేసిన వస్త్రాలకు సరైన మార్కెటింగ్ లేక, కార్మికులకు ఉపాధి దొరకక అప్పుల బాధతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఉద్యమాలతో హక్కులు సాధించుకోకపోతే మనుగడ సాధ్యం కాదన్నారు. చేనేత రుణమాఫీ, జీరో జీఎస్టీ అంశాలపై సమగ్రంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు. చేనేత పరిశ్రమ పరిరక్షణ కోసం నాయకులు, కార్మికులు ఐక్యంగా పోరాడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత రాష్ట్ర నాయకులు తడక యాదగిరి, తడక రమేశ్, చేనేత జన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు చింతకింది రమేశ్, జిల్లా అధ్యక్షుడు కర్నాటి పురుషోత్తం, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు భారత వాసుదేవ్, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు, నాయకులు ఎన్నం శివకుమార్, చిక్క కృష్ణ, గంజి బసవలింగం, మంగళపల్లి శ్రీహరి, బోడ దయానంద్, కటకం శ్యాంసుందర్, చింతకింది దామోదర్, వేముల పాండు, ముసుకూరి నరసింహ, నాయకులు పాల్గొన్నారు.