ఆలేరు టౌన్, ఏప్రిల్ 20 : సమాజంలో సేవ చేయడం కన్నా గొప్ప అనుభూతి ఏది లేదని, సేవ చేయడం ద్వారా మన మనస్సుకు సంతృప్తి కలుగుతుందనీ రాష్ట్ర నేత్ర, అవయవ, శరీర దాతల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహ్మద్ ఖుర్షీద్ పాషా అన్నారు. ఆదివారం ఆలేరుకు చెందిన సీనియర్ సిటిజన్ మొరిగాడి సర్వయ్య తన మరణానంతరం భౌతిక దేహాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు అప్పగిస్తూ హామీ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పాషా మాట్లాడుతూ సమాజ హితం కోసం తమ కుటుంబ సభ్యులను ఒప్పించి వైద్య విద్యార్థుల ప్రయోగాల కోసం సర్వన్న తన శరీరాన్ని స్వచ్ఛందంగా దానం చేయడం అభినందనీయం అన్నారు.
ప్రతి ఒక్కరూ సామాజిక స్ఫూర్తితో తమ కండ్లను, అవయవాలను, శరీరాన్ని భావి తరాల వైద్యులను తయారు చేసేందుకు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మాజీ సర్పంచ్, ఆకవరం మోహన్ రావు, సీనియర్ జర్నలిస్టు మొరిగాడి మహేష్, ముల్లెక్కల రవి కుమార్, చింతకింది వెంకటేష్, సీస సాయి కుమార్, మోరిగాడి బొందయ్య, మొరిగాడి అజయ్ కుమార్, చింతపండు వెంకటేష్, శ్రీకాంత్, జయమ్మ తదితరులున్నారు.