యాదగిరిగుట్ట, ఆగస్టు 21 : బీఆర్ఎస్ పాలనలోనే యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి నూతన భవనం మంజూరైందని ఆ పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య తెలిపారు. రాష్ట్ర తొలి సీఎంగా కేసీఆర్ యాదగిరిగుట్టను మున్సిపాలిటీగా మార్చడంతో పాటు టీయూఎఫ్‌డీసీ కింద రూ.20 కోట్లు గత పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నిధులను సైతం మంజూరు చేసినట్లు చెప్పారు. గురువారం యాదగిరిగుట్ట పట్టణంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తీరుపై మండిపడ్డారు. సర్వహంగులతో నూతన మున్సిపాలిటీ భవన నిర్మాణానికి రూ.4 కోట్లు, పాతగుట్ట చౌరస్తా నుంచి పాతగుట్ట ఆలయం వరకు రూ.2.50 కోట్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలోనే మంజూరు చేయడమే కాకుండా 2023 అక్టోబర్ మాసంలో ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి చేతుల మీదుగా పనులకు శంకుస్థాపన చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
యాదగిరిగుట్ట పట్టణానికి ఒక్క రూపాయి సైతం కేటాయించకుండానే గతంలో మంజూరైన పనులను ప్రారంభిస్తూ ఎమ్మెల్యే కాలం వెళ్లదీస్తున్నట్లు ఎద్దేవ చేశారు. 22 నెలల్లో ఇప్పటి వరకు ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి తీసుకు వచ్చిన నిధులపై శేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓటర్లను ఓట్లు అడిగే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేకుండా పోయిందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, నార్మూల్ మాజీ డైరక్టర్ ఒగ్గు మల్లేశ్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు మిట్ట వెంకటయ్య, ఆవుల సాయి, గంగసాని నవీన్, పాండవుల భాస్కర్ గౌడ్ పాల్గొన్నారు.