కోదాడ, సెప్టెంబర్ 2 : పట్టణంలో వర్ష బీభత్సానికి శిరిడీ సాయినగర్, భవానీ నగర్, మాతా నగర్, హరిజనవాడల్లో ఐదు ఇండ్లు కూలిపోయాయి. మరికొన్ని ఇండ్ల ప్రహరీలు నేలమట్టం అయ్యాయి. సుమారు 150 పైగా ఇండ్లలోకి వరద చేరి విలువైన వస్తువులు తడిచిపోయాయి. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శ్రీరంగాపురం వద్ద తొలగించిన డివైడర్లను పరిశీలించి నష్టాన్ని బాధితులను అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు గాంధీనగర్‌లో ఎమ్మెల్యే పద్మావతి పర్యటించి బాధితులను పరామర్శించారు. లోతట్టు ప్రాంతాలను మాజీ ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్ సందర్శించి బాధితులను ఓదార్చారు.
తొగర్రాయిలో దయనీయ పరిస్థితి
కోదాడ రూరల్ : వర్ష బీభత్సానికి మండల పరిధిలోని తొగర్రాయి, కూచిపూడి, మంగలితండా, చిమిర్యాల, రెడ్లకుంట గ్రామాల్లో వరి పంటపొలాల్లో ఇసుక మేట చేరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చిలుకూరు మండల పరిధి నారాయణపురం చెరువు తెగి తొగర్రాయి గ్రామం మునిగిపోయింది. మూడువైపులా రోడ్లు తెగిపోయి గ్రామం నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొన్నది. ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా గ్రామం వైపు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ సరఫరా, తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విలపిస్తున్నారు. చాలా ఇండ్లు నేటమట్టమై, పలు గృహాల్లోకి నీరు చేరి నిత్యావసరాలు తడిచి పోయాయని మహిళలు చెప్తున్నారు. కాల్వ ఒడ్డున మోటార్లన్నీ కొట్టుకొని పోయాయని రైతులు వాపోయారు. రెడ్లకుంట, చిమిర్యాల, మంగలితండా గ్రామాల్లో రైతులు వందల ఎకరాల్లో పంట నష్టపోయారు. వీటితో పాటు గేదెలు, మేకలు, కోళ్లు అధిక సంఖ్యలో మృత్యువాత పడ్డాయి. ఇదిలా ఉండగా తొగర్రాయి గ్రామాన్ని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి సోమవారం ఉదయం అధికారులతో కలిసి నామ మాత్రంగా సందర్శించారు.
విజయవాడ-హైదరాబాద్‌కు రాకపోకలు పునః ప్రారంభం
కోదాడ రూరల్ : ఆంధ్రా – తెలంగాణ సరిహద్దులో రామాపురం క్రాస్‌రోడ్డు సమీపంలోని పాలేరు వాగుపై పాత బ్రిడ్జి డ్యామేజ్ కావడం, ఆంధ్రా రాష్ట్రం నందిగామ వద్ద వరద ఉధృతి తగ్గడంతో విజయవాడ – హైదరాబాద్‌కు భారీ వాహనాల రాకపోకలకు అనుమతులిచ్చారు. అయితే నందిగామ వరకు మాత్రమే అనుమతులు ఉన్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు. విజయవాడ వరకు ప్రస్తుతం వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు పేర్కొన్నారు.