రాజాపేట, అక్టోబర్ 06 : వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం రాజాపేట మండలం చల్లూరు గ్రామంలో పల్లె దవాఖానని ఆయన ఆకస్మిక తనిఖీ చేసి అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించారు. పల్లె దవాఖానకు వైద్యం కోసం వచ్చిన వృద్ధులతో కలెక్టర్ మాట్లాడి అందుతున్న సేవలపై ఆరా తీశారు. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. పల్లె దవాఖాన చుట్టూ పిచ్చి మొక్కలు బాగా పెరిగి ఉండటంతో వెంటనే చెట్లను తొలగించి శుభ్రం చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. అనంతరం రేణికుంట గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని సూచించారు.