– కుటుంబంలో తలెత్తిన వివాదం.. చెరువులో దూకి ఆత్మహత్య
– తల్లిని కొట్టిన వీడియో వైరల్ కావడంమే కారణం
బీబీనగర్, అక్టోబర్ 10 : పరువు పోయిందని తలెత్తుకొని తిరగలేను అంటూ చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. హైదరాబాద్ లోని విజయపురి కాలనీకి చెందిన రేవల్లి రాజు (40) గత కొద్ది రోజుల క్రితం కుటుంబ కలహాలతో తన తల్లిని కొట్టాడు. తల్లిని కొడుతుండగా తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఇది గుర్తించిన రేవల్లి రాజు వీడియో తీసి సామాజిక మాద్యమాల్లో వైరల్ చేశారని, ఇక తాను సమాజంలో తలెత్తుకుని తిరగలేనని సెల్ఫీ వీడియో తీసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
రాజు బీజేవైఎం క్రియాశీలకంగా పని చేస్తున్నాడు. స్నేహితులు, బీజేవైఎం నాయకులకు చనిపోతున్నా అంటూ వీడియో ద్వారా తెలుపుతూ, తనను క్షమించాలని తన కుటుంబానికి అండగా ఉండాలని కోరాడు. శుక్రవారం రాజు భార్య మహిమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ ఎం.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.