బీబీనగర్, సెప్టెంబర్ 20 : తనను గత పది రోజులుగా ఏదో శక్తి రమ్మని పిలుస్తుందంటూ ఓ వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా రాంనగర్‌కు చెందిన బర్ల సురేందర్ (36) హైదరాబాద్ రామంతపుర్లో గల డీ మార్ట్ వెనకాల భార్య, పిల్లలతో నివసిస్తున్నాడు. సురేందర్ హైటెక్ సిటీలోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం డ్యూటీకి వెళ్తున్నా అని చెప్పి బయల్దేరి క్యాబ్ బుక్ చేసుకుని బీబీనగర్ పెద్ద చెరువు వద్దకు చేరుకున్నాడు. చెరువు వద్దకు రాగానే తన భార్యకు నాకు నిత్యం కలలో చావు రమ్మటుందని, శక్తి పిలుస్తుందని, పీడ కలలు వస్తున్నాయని, ఎవరో పిలుస్తున్నట్లు అనేక రకాలుగా కలలు వస్తున్నాయని, నేను చనిపోతున్నానని మెసేజ్, వాయిస్ రికార్డులు పంపించాడు. నా చావుకి ఎవరూ కారణం కాదని, ఎలాంటి విచారణ చేపట్టవద్దని చెప్పి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
కుటుంబ సభ్యులు సురేందర్ మానసిక పరిస్థితి బాగాలేదని పలు దేవాలయాలు, దైవ దర్శనాలకు తిప్పారు. మానసిక పరిస్ధితి మెరుగు కావడంతో ఇక నుంచి ఉద్యోగానికి వెళ్తానని ఇంట్లో చెప్పడంతో బయటకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. గత నాలుగు రోజులుగా డ్యూటీకి సక్రమంగా వెళ్తున్న సురేందర్ శుక్రవారం ఉదయం ఉద్యోగానికి వెళ్తున్నట్లు చెప్పి క్యాబ్ బుక్ చేసుకుని బీబీనగర్ పెద్ద చెరువుకు చేరుకున్నాడు. చెరువు వద్దకు రాగానే కుటుంబ సభ్యులు, బంధువులకు ఫోన్ ద్వారా చెరువులో దూకి చనిపోతున్నానని, నాకు పాత ఇంట్లో చావు కార్యక్రమాలు చేయాలని, నా చావుకు ఎవరూ కారణం కాదని వాయిస్ రికార్డు చేసి బంధువులకు పంపి, చెరువు గట్టుపై షూ విప్పి, సెల్ ఫోన్ పెట్టి చెరువులో దూకాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టారు. సురేందర్‌కు భార్య, కుమారుడు(5) ఉన్నాడు.
భర్త చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని, సురేందర్ భార్య కూడా చెరువులో దూకింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు, రెస్క్యూ టీం సంధ్యారాణిని వెంటనే కాపాడారు. చెరువులో దూకిన సంధ్యారాణి వద్దకు వెళ్లి కుమారుడు అమ్మా నువ్వు చనిపోవద్దని అనడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ రోధించారు. పోలీసులు, రెస్క్యూ టీం సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టగా శనివారం ఉదయం మృతదేహం లభించింది.
Bibinagar : ఏదో శక్తి పిలుస్తోంది వెళ్తున్నా.. చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య