రాజాపేట, అక్టోబర్ 10 : నల్లగొండ- రంగారెడ్డి జిల్లాల మదర్ డైయిరీ చైర్మన్‌గా గుడిపాటి మధుసూదన్‌రెడ్డి అనర్హుడని, పాడి రైతులందరికీ తక్షణమే బేషరతుగా ఆయన క్షమాపణ చెప్పాలని మదర్ డైయిరీ డైరెక్టర్ సందిళ్ల భాస్కర్ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం రాజాపేట పాల సొసైటీ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామానికి చెందిన పాడి రైతు చైర్మన్ మధుసూదన్‌రెడ్డికి ఫోన్ చేసి సార్ దసరా పండుగకు బిల్లులు కావాలని అడిగితే.. చైర్మన్ ఓడిపోయిన నైర్యాశంతో అసహనం వ్యక్తం చేస్తూ పాడి రైతుతో మాట్లాడడం సరి కాదన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మదర్ డైయిరీ మునిగితే ఏంది.. తేలితే ఏంది..నాకేంది అని మాట్లాడడం సరికాదని హితవు పలికారు.
డైయిరీ అభివృద్ధి కోసం పూర్వం పని చేసిన వారి అడుగుజాడల్లో తాను నడవాలే తప్పాఆయన ఒక్కరే సంస్థను కాపాడుతున్నట్లు మాట్లాడడం శోచనీయం అన్నారు. గతంలో గుత్తా జితేందర్ రెడ్డి రైతుల పక్షాన నిలబడి 13 సంవత్సరాలు చైర్మన్‌గా హుందాగా సాగించిన తీరు గుర్తుంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ తన సొంత మార్కును చూపెట్టి సంస్థలో పేరు సంపాదించుకున్నవారే అన్నారు. ఇదివరకు సంస్థకు చైర్మన్‌గా పనిచేసిన వారు ఇలా ఎప్పుడు మాట్లాడలేదన్నారు. కాబట్టి పదవికి గౌరవం ఇవ్వని మధుసూదన్‌రెడ్డి సంస్థలో చైర్మన్ పదవికి అనర్హుడని, వెంటనే రాజీనామా చేయాలని భాస్కర్ గౌడ్ డిమాండ్ చేశారు.