ఆలేరు టౌన్, మార్చి 29 : ఎల్ఆర్ఎస్ గడువును ప్రభుత్వం పొడిగించాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ మాజీ చైర్మన్ వస్పరి శంకరయ్య అన్నారు. శనివారం ఆలేరు పట్టణ కేంద్రంలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించి ప్రజలకు వెసులుబాటు కల్పించాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎల్ఆర్ఎస్ను తీసుకొస్తే ఆనాడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రజల సొమ్మును ఎల్ఆర్ఎస్ పేరు మీద లూటీ చేస్తున్నారని ఆరోపించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం 25 శాతం ఆశ చూపి ప్రజల ముక్కు పిండి ఎల్ఆర్ఎస్ వసూలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి షాదీఖానా సమీపంలో ముస్లిం మైనార్టీ కమిటీ హాల్ కోసం శంకుస్థాపన చేస్తే పనులు ప్రారంభించకుండా, అదే స్థానంలో పాత శిలాఫలకం తీసి కొత్త శిలాఫలకం ఏర్పాటు చేసి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య శుక్రవారం శంకుస్థాపన చేయడం సమంజసమేనా అని ప్రశ్నించారు. గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి హయాంలో రూ.18 కోట్ల ప్రత్యేక నిధులు ఆలేరు అభివృద్ధి కోసం తీసుకొస్తే ఆనాడు ఎలక్షన్ కోడ్ వల్ల నిధులు ఆగిపోయినట్లు చెప్పారు. వర్క్ ప్రొసీడింగ్ జరిగి కాంట్రాక్టర్ కు పనులు అప్పగించకుండా కాలయాపన చేస్తూ ఆలేరు అభివృద్ధి నిరోధకులుగా అయిలయ్య మారారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అరాచకాలను, మోసాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఆలేరులో తాగునీరు లేక, మిషన్ భగీరథ నీళ్లు రాక ప్రజలకు తాగునీరు అందించకపోవడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గొర్ల కాపరుల సంఘం డైరెక్టర్ జల్లి నరసింహులు, ఎగ్గిడి సిద్దులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.