బీబీనగర్, నవంబర్ 03 : ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలని, భవన నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని భువనగిరి ఎంపీ, బీబీనగర్ ఎయిమ్స్ పాలక మండలి సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని బీబీనగర్ ఎయిమ్స్‌ను ఆయన సందర్శించి నిర్మాణ పనులుతో పాటు వివిధ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా చేపట్టాలని, స్థానిక యువతకు అవకాశాలు ఇవ్వాలని అధికారులకు సూచించారు.
అనంతరం ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ అమితా అగర్వాల్ ఎయిమ్స్ అభివృద్ధిలో భాగమైన పలు అంశాలు, ప్రభుత్వం తరపున ఎయిమ్స్ పరిధిలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు, ఎయిమ్స్ బీబీనగర్ వద్ద అన్ని బస్సులు ఆగేలా చర్యలు, ఉప్పల్ నుండి ఎయిమ్స్ వరకు ప్రత్యేక బస్సు సేవలు ప్రారంభించేలా కృషి చేయాలని కోరుతూ ఎంపీకి ప్రతిపాదనలు అందజేశారు. ఈ ప్రతిపాదనలపై ఎంపీ చామల సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధేవిధంగా నిర్మాణ సంస్దలు ఎన్సిసి, హైట్స్ ప్రతినిధులతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించి నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు.

Bibinagar : ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలి : ఎంపీ చామల