గట్టుప్పల్, జూన్ 26 : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం గట్టుప్పల్ మండల పరిధిలోని తెరట్పల్లి గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలు నిర్వహించడమంటే కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికీ బీసీలకు ద్రోహం చేయడమేనని విమర్శించారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం పొంది మూడు నెలలు అవుతున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించడానికి చేసిన ప్రయత్నం శూన్యమని మండిపడ్డారు.
మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పటికైనా చౌకబారు రాజకీయాలు చేయడం మానుకుని, తమిళనాడు తరహాలో రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేందుకు రోడ్ మ్యాప్ రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చని పక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మహ్మద్ యూసుఫ్, చండూరు మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు గొరిగె సత్తయ్య, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మండల కృష్ణ, పార్టీ నాయకులు చెరుకుపల్లి వెంకటయ్య, పగిళ్ల సైదులు, బీసీ నాయకుడు వీరమల్ల మల్లేశ్ గౌడ్ పాల్గొన్నారు.