నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇలాకాలో వేలాది మంది ఇలాగే రుణమాఫీకి దూరంగా ఉన్నారు. రాష్ట్రంలో రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్ ఆచరణలో అనేక కొర్రీలు పెడుతూ లబ్ధిదారుల సంఖ్యను సగానికి సగం తగ్గించిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రేషన్‌కార్డు ప్రమాణికంగా కుటుంబంలో గరిష్టంగా రూ.2 లక్షల రుణమాఫీ వర్తింపచేయడంతో భారీగా కోత పడిందన్నది నిజం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కనీసం 6 లక్షల మంది రుణమాఫీకి అర్హులు ఉంటారని ప్రారంభంలో అంచనా వేయగా, మూడు దశల్లో కలిపి అది కేవలం 3.39లక్షల మందికే పరిమితమైంది.
దాంతో మిగతా రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. బాధితులు బ్యాంకులు, సహకార సొసైటీలు, వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం బ్యాంకుల్లో ఇంకా స్పష్టత రాకపోవడంతో ‘నమస్తే తెలంగాణ’ సహకార సొసైటీలపై కేంద్రీకరించి రుణమాఫీపై ఆరా తీసింది. నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో రుణమాఫీపై లెక్కలను తీసుకుంటే.. కేవలం 58.63శాతం మంది రైతులకే రెండు లక్షల రుణమాఫీ వర్తించినట్లు స్పష్టమైంది. కావాల్సిన రుణమాఫీ మొత్తంలో 55.95 శాతమే అవడం గమనార్హం. బ్యాంకు అధికారుల లెక్కల ప్రకారమే మొత్తం డీసీసీబీ పరిధిలోని 107 సొసైటీల పరిధిలో రుణమాఫీకి అర్హులైన రైతులు 89,888 మంది ఉండగా, అందులో 2 లక్షల రుణమాఫీ అయిన రైతుల సంఖ్య 52,708 మాత్రమే. 37,180 మంది రుణమాఫీకి నోచలేదు. వీరికిగానూ మొత్తం 499.98కోట్ల రుణమాఫీ లబ్ధి జరుగుతుందని అంచనా వేయగా ఇందులో 279.76 కోట్ల రుణాలు మాత్రమే మాఫీ అయ్యాయి.
ఇంకా రూ.220.22కోట్ల రుణాల మాఫీ గురించి స్పష్టత లేదు. క్షేత్రస్థాయిలో జిల్లా కేంద్రానికి సంబంధించిన పానగల్ సహకార సొసైటీని పరిశీలిస్తే ఇందులో పెద్దఎత్తున రుణమాఫీ కాని వాళ్లే కనిపించారు. పానగల్ సొసైటీ అధికారుల లెక్కల ప్రకారం.. మొత్తం 1,274 మంది రైతులను రుణమాఫీకి అర్హులుగా తేల్చారు. అందులో రూ.లక్ష వరకు 501 మందికి, లక్షన్నర వరకు 211 మందికి, 2లక్షల వరకు 70 మందికే రుణమాఫీ వర్తించింది. ఇంకా 492 మందికి వివిధ కారణాలు చూపుతూ రుణమాఫీకి దూరం చేశారు. వారంతా శనివారం సాయంత్రానికి కూడా జాబితాపై ఇంకా స్పష్టత రాలేదు. సోమవారం నాటికి జాబితాలో పేర్లు లేకుంటే అందుకు కారణాలు తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడు పీఏసీఎస్‌ను పరిశీలిస్తే… 245 మందికి రుణమాఫీ కాలేదు. ఇక్కడ మొత్తం 591 మంది అర్హులు ఉండగా 366 మందికే రుణమాఫీ వర్తించడం గమనార్హం. రేషన్‌కార్డు లేకపోవడం, అకౌంట్ నెంబర్లల్లో తప్పుల కారణంగా రుణమాఫీ కాలేదని సొసైటీ సీఈఓ పాలకూరి సుఖేందర్‌గౌడ్ తెలిపారు. అనుముల మండలం కొత్తపల్లిలో పరిశీలిస్తే మొత్తం 1,326 మంది అర్హులు ఉండగా, కేవలం643 మందికే రుణమాఫీ అయ్యింది.
683కి ఇంకా కాలేదు. మొత్తం 7.50కోట్లకు గానూ 3.13 కోట్లే రుణాలు మాఫీ అయ్యాయి. దామరచర్ల పీఎసీఎస్‌లో మొత్తం 821 మంది రుణాలు పొందగా, అందులో 515 మందికే రుణమాఫీ జరిగింది. 2 లక్షల రుణమాఫీ కేవలం 38 మందికే అవడం గమనార్హం. కొండమల్లేపల్లి పీఎసీఎస్‌లో మొత్తం 973 మందికి గానూ 648 మందికి మాత్రమే కాగా 325 మంది రుణమాఫీకి దూరమయ్యారు. శాలిగౌరారం పీఏసీఎస్‌లో మొత్తం 379 మందికి గానూ 180 మందికే రుణమాఫీ జరిగి 199 మందికి అవలేదు. మిర్యాలగూడ పీఎసీఎస్‌లో మొత్తం 652 మంది రైతులు ఉండగా 445 మందికి కాగా 207 మందికి కాలేదు. ఇలా ఏ సొసైటీని పరిశీలించినా 40 నుంచి 50 శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదు. దీనిపై డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డిని ‘నమస్తే తెలంగాణ’ వివరణ కోరగా.. రుణమాఫీ కాని రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. కొందరి ఆధార్ కార్డులు, కొందరి పేర్లు, కొందరి రేషన్ కార్డుల తప్పిదాల వంటి సాంకేతిక సమస్యలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. వారం రోజులు స్పెషల్ డ్రైవ్‌తో వాటిని పరిష్కరించి రుణమాఫీ అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. మరోవైపు రుణమాఫీ వర్తించని వారి నుంచి దరఖాస్తులు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. బ్యాంకు లేదా రైతువేదికల వద్ద వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉండి రైతుల నుంచి వివరాలు సేకరించనున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పి.శ్రవణ్‌కుమార్ వెల్లడించారు.
కుటుంబంలో ఒక్కరికి కూడా మాఫీ కాలేదు…
ఈ రైతు పేరు ముదిరెడ్డి శేఖర్‌రెడ్డి. ఊరు నల్లగొండ మండలం చిన్నసూరారం. వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. వరి, పత్తి పంటలు సాగు చేస్తున్నాడు. ఐదున్నర ఎకరాల సాగు భూమి ఉంది. వ్యవసాయం కోసం బ్యాంకు నుంచి రుణం తీసుకున్నాడు. తల్లి పేరున లక్ష రూపాయలు రుణం ఉంది. ఈయన పేరు లక్షా 60 వేలు ఉంది. వీరందరికీ ఒకటే రేషన్‌కార్డు ఉంది. అయినా ఈయనకు గానీ, తల్లికి గానీ రుణమాఫీ కాలేదు. కారణం ఏంటో తెల్వక ఆందోళన చెందుతున్నారు. నల్లగొండ జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయానికి వస్తే కారణమేంటో అక్కడ కూడా ఎవరూ చెప్పలేదు. దీనిపై రైతు ముదిరెడ్డి శేఖర్‌రెడ్డి స్పందిస్తూ.. తమ కుటుంబంలో ఒక్కరికైనా రుణమాఫీ అవుతుందనుకున్నట్లు చెప్పారు. కానీ ఒక్కరికీ రాలేదని, రాకపోవడానికి కారణం కూడా తెలియడం లేదని వాపోయాడు. చేస్తే అందరికీ చేయాలి గానీ, ఏవో షరతులు పెట్టి తమలాంటి రైతులను ఇబ్బందులకు గురిచేయడం ఏంటని ప్రశ్నించారు. మూడో విడత రుణమాఫీ జాబితాలు బ్యాంకుల వద్ద గానీ, సొసైటీల వద్ద గానీ పూర్తి స్థాయిలో లభించకపోవడంతో రెండు, మూడ్రోజుల్లో స్పష్టత రావచ్చని తెలుస్తున్నది.