భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 11 : గౌరెల్లి నుండి భద్రాచలం వరకు ఔటర్ రింగ్ రోడ్డు కోసం సేకరించిన భూములకు బహిరంగ మార్కెట్ ప్రకారంగా నష్ట పరిహారం చెల్లించాలంటూ భూ బాధితులు డిమాండ్ చేశారు. భూదాన్ పోచంపల్లి మండలంలో ఒక్క ఎకరానికి కోటి రూపాయలకు పైగా బహిరంగ మార్కెట్లో ధర పలుకుతుందని, ప్రభుత్వం ఎకరానికి రూ. 24 లక్షలు మాత్రమే చెల్లిస్తుందన్నారు. త్రిబుల్ ఆర్ కింద ఎకరానికి రూ.47 నుండి 50 లక్షలు చెల్లిస్తుందని బాధితులు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి వద్ద గురువారం ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు సమీపాన ఉన్న పోచంపల్లి మండలంలో 226 ఎకరాలు, మండలంలోని పిల్లాయిపల్లిలో 33 ఎకరాలు, కనుముకుల్లో 22 ఎకరాలు పోతుందని తెలుపుతూ రైతులందరికీ నోటీసులు ఇచ్చారన్నారు. ఒక ఎకరం ఉన్నవారికి పూర్తిగా పోతుందని తెలిపారు. పిల్లాయిపల్లి సరిహద్దులో రంగారెడ్డి జిల్లా భూములకు అధిక ధరలు ఇస్తున్నారని, తమకు కూడా న్యాయం చేయాలని ఎమ్మెల్యేను రైతులు వేడుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు ఫోన్ చేసి రైతుల విషయాన్ని వివరించి న్యాయం చేయాలని కోరారు.
అంతకుముందు భూదాన్ పోచంపల్లి మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గ్రామాల్లో వీధిలైట్లు, కరెంట్ తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధి కోసం అధికారులందరూ కృషి చేయాలన్నారు. ప్రపంచ పర్యాటక ఉత్తమ గ్రామంగా పేరొందిన పోచంపల్లిలో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణానికి రూ.9.50 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. పోచంపల్లి పెద్ద చెరువు కట్టను వెడల్పు చేసి సుందరంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తాసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అంజన్ రెడ్డి, ఎంపీడీఓ రాపర్తి భాస్కర్, డిప్యూటీ ఎమ్మార్వో నాగేశ్వరరావు, ఎంపీఓ మజీద్, ఎం ఆర్ ఐ గుత్తా వెంకట్‌రెడ్డి, నరసింహారెడ్డి, నాయకులు తడక వెంకటేశ్, భారత లవ కుమార్, పాక మల్లేశ్ యాదవ్, కాసుల అంజయ్య, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, స్పెషల్ ఆఫీసర్స్, గ్రామ పాలన అధికారులు, వార్డ్ ఆఫీసర్స్, ట్రాన్స్‌కో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు.
Bhoodan Pochampally : మాకు న్యాయం చేయండి సారూ.. ఎమ్మెల్యే కుంభంకు భూ బాధితుల వేడుకోలు