బీబీనగర్, మార్చి 29 : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని రాఘవాపురం గ్రామం నుండి భువనగిరి మండలం బొల్లెపల్లి చెరువు వరకు 18 కిలోమీటర్ల కాల్వ నిర్మాణానికి భూసేకరణ పనులు కొనసాగుతున్నాయి. శనివారం మండలంలోని చిన్నారవులపల్లి, భట్టుగూడెం, రామునిగుండ్లతండాలో సర్వే పనులను అధికారులు నిర్వహించారు. ఈ సందర్బంగా మండల మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు గోరుకంటి బాలచందర్ మాట్లాడుతూ.. కాల్వ నిర్మాణానికి భూసేకరణ చేపట్టిన అధికారులు 56 ఎకరాల భూమిని గుర్తించి రైతులకు 2008 సంవత్సరంలో నోటీసులు అందజేశారని, రైతులకు ఎలాంటి నష్ట పరిహారం చెల్లించలేదని పనులు కూడా నామమాత్రంగా చేపట్టారన్నారు.
కాల్వ ద్వారా నీరు చెరువుల్లోకి సరిగ్గా చేరకపోవడంతో కాల్వ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయని తెలిపారు. ప్రస్తుతం మండలంలోని రాఘవాపురం, లక్ష్మీదేవిగూడెం, బ్రాహ్మణపల్లి, చిన్నరావులపల్లి, భట్టుగూడెం, రామునిగుండ్లతండా, పెద్దపలుగు, చిన్నపలుగుతండా, రావిపహాడ్, మాదారం గ్రామాల్లో భూ సేకరణ చేపట్టి రైతులకు నష్ట పరిహారం వెంటనే చెల్లించాలన్నారు. అలాగే కాల్వ నిర్మాణం ద్వారా రైతులకు రెండు పంటలకు నీళ్లు అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ శ్రీనివాస్, లైన్ ఇన్స్పెక్టర్ శివకుమార్, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
Land survey : బొల్లెపల్ల్లి కాల్వకు కొనసాగుతున్న భూ సర్వే