బీబీనగర్, సెప్టెంబర్ 15 : బీబీనగర్ మండలంలోని కొండమడుగు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 756 ఎండోమెంట్ (దేవస్థాన భూమి)గా ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల్లో నమోదైందని, ఆ రికార్డును సరిచేసి పేద ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావును అఖిలపక్ష నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్వే నెం.756 గల భూమిలో గత 30 సంవత్సరాల క్రితం పేద ప్రజలు ఇండ్లను నిర్మించుకున్నారని, నిర్మించుకున్న గృహాలకు కొండమడుగు గ్రామ పంచాయతీ నుండి మురుగు కాల్వలు, రోడ్లు, వీది దీపాలు, మంచి నీటి సరఫరా వంటి సౌకర్యాలు కల్పించారన్నారు. కరెంట్ బిల్లులు, నల్లా బిల్లులు చెల్లిస్తున్నా కానీ నిర్మించుకున్న గృహాలకు గ్రామ పంచాయతి నుండి ఎటువంటి అనుమతి మంజూరు చేయట్లేదని తెలిపారు.
నూతనంగా ఇల్లులను నిర్మించుకోవాలనుకునే వారికి బ్యాంకుల నుండి ఎటుంవంటి లోన్లు రావడం లేదని, 756 సర్వే నంబర్లో గల నివాస గృహాలకు, ఖాళీ స్థలాలకు రిజిస్ట్రేషన్లు జరుగడం లేదన్నారు. దీంతో పేద ప్రజలందరూ ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలిపారు. గతంలో కూడా మండల తాసీల్దార్ రికార్డును పరిశీలించి నివేదిక పంపించారని, ఎండోమెంట్ అధికారులకు ఇంతవరకు స్పందించలేదన్నారు. రికార్డులను సరిచేసి ఇండ్లను నిర్మించుకున్న పేద ప్రజలకు, నూతనంగా ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతల సుదర్శన్‌రెడ్డి, కడెం సాయిప్రసాద్, కనకబోయిన రాజమల్లేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.