– ఆమె సస్పెండ్‌ను స్వాగతిస్తున్నాం
– మాజీ జడ్పీటీసీ తోటకూరి అనురాధ
యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 03 : ఎంపీగా, ఎమ్మెల్సీగా పదవిని కట్టబెట్టిన కన్నతల్లిలాంటి బీఆర్ఎస్ పార్టీపై కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా నాయకురాలు, మాజీ జడ్పీటీసీ తోటకూరి అనురాధ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేస్తూ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. బుధవారం యాదగిరిగుట్ట మండలంలోని చొల్లేరు గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 24 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీలో ఉండి అధికారాలు అనుభవించి, పార్టీకే ద్రోహం తలపెట్టిన కవిత క్షమించారని తప్పు చేసిందన్నారు. కేసీఆర్ పరువు తీసేంత సాహసం చేయడం ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. కవిత బీఆర్ఎస్ పార్టీలో లేకున్నా పార్టీకి వచ్చే నష్టమేమి లేదన్నారు.
గత మూడు నెలలుగా కవిత తన వ్యాఖ్యలతో పార్టీకి ఇబ్బంది కలిగించిందని ఆరోపించారు. పేగుబంధం కన్నా తనను నమ్ముకున్న కోట్లాది ప్రజలే ముఖ్యమంటూ కేసీఆర్ మరోసారి నిరూపించారన్నారు. పార్టీ విధివిధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన ఎంతటి వారైనా బహిష్కరణకు గురికాక తప్పదని నిరూపితమైందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, పార్టీ అధినేత కేసీఆర్‌కు రక్త సంబంధీకులైనా, పార్టీ నాయకులైనా ఒక్కటేనన్నారు. కవితపై సస్పెండ్ నిర్ణయం తీసుకున్న కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మహిళా మండల నాయకులు తోటకూరి స్రవంతి, కొక్కలకొండ పూజిత, వద్దిగళ్ల పద్మ, రేణుక, చిన్నం చైతన్య, తోటకూ వెంకటమ్మ, ఫరీదాబేగం పాల్గొన్నారు.