– 6 బ్యాచ్‌లుగా సత్యనారాయణ వ్రతాలు
– కార్తీక పౌర్ణమి రోజున 8 బ్యాచ్‌లుగా వ్రతాలు
– ఈఓ రవి ఏర్పాట్ల పరిశీలన
యాదగిరిగుట్ట, అక్టోబర్ 14 : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో ఈ నెల 22వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈఓ జి.రవి తెలిపారు. మంగళవారం యాదగిరిగుట్ట దేవస్థానంతో పాటు కొండ కింద వ్రత మండపాన్ని ఆయన పరిశీలించారు. కార్తీకమాసంలో అధిక సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని విధాలుగా ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకు రావాలని ఇంజినీరింగ్, శానిటేషన్, వ్రత మండపం, రిసెప్షన్, గోదాం, పరిపాలన, భద్రతా సిబ్బంది, పాతగుట్ట, ప్రసాద విక్రయం, ప్రచార శాఖ, లీజెస్, ఆన్లైన్ విభాగాలకు ఆయన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సత్యనారాయణ స్వామి వ్రత మండపంలోని హాల్ 1, 2 లలో రోటేషన్ పద్ధతిన 6 బ్యాచ్ లుగా సత్యనారాయణస్వామి వ్రతాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మొదటి బ్యాచ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై చివరి 6వ బ్యాచ్ సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందన్నారు. నవంబర్ 5వ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా 8 బ్యాచ్ లుగా వ్రతాలు జరుగనున్నట్లు చెప్పారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు వ్రతాలు కొనసాగుతాయన్నారు. పాతగుట్ట ఆలయంలో నాలుగు బ్యాచ్ లు, కార్తీకపౌర్ణమి రోజున 6 బ్యాచ్ లు వ్రతాలు నిర్వహిస్తామన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 5వ తేదీన ప్రధానాలయంతో పాటు అనుబంధ పర్వత వర్ధనీ సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఆకాశ దీపారాధన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్తీకమాసాంతం వరకు ప్రతి శని, ఆదివారాలలో వెయ్యి మందికి ఉచిత అన్నప్రసాదం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.