బీబీనగర్, ఆగస్టు 23 : బీబీనగర్ ఎయిమ్స్‌లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న శాంతియుత నిరసన దీక్ష చేపట్టనున్నట్లు బీఆర్ఎస్ బీబీనగర్ మండల మాజీ అధ్యక్షుడు పిట్టల అశోక్ తెలిపారు. శనివారం పార్టీ బీబీనగర్ గ్రామ శాఖ అధ్యక్షుడు గోలి సంతోష్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణలో గల గాంధీ విగ్రహానికి పూలమాల వేసి దీక్షా కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. ఎయిమ్స్ ఏర్పాటుకు భూములు త్యాగాలు చేసి, గాలి, నీటి కాలుష్యాన్ని భరిస్తున్న బీబీనగర్ వాసులకు ఉద్యోగాలు దక్కాల్సిన అవసరం ఉందన్నారు. ఎయిమ్స్ కాంట్రాక్టర్లు దొంగచాటున ఇతర ప్రాంతాల వారికి ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ తరఫున ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేస్తామని, ప్రజలకు వివరించి దీనిపై ప్రత్యక్ష పోరాటం చేస్తామని తెలిపారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఈ సమస్యను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ నెల 25న ఎయిమ్స్ గేటు ముందు చేపట్టనున్న దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మల్లగారి శ్రీనివాస్, అమృతం శివకుమార్, దేవరకొండ శ్రీనివాస్, దవాడి బాలయ్య, పంజాల మహేశ్ గౌడ్, దేవరుప్పుల పృథ్వీరాజ్, పొట్ట శ్రీనివాస్, రాజు, కుశంగల మురళి, పేరబోయిన నరేశ్, వంగరి పరంకుశం, బోయిన కృష్ణ, మిట్టు, మహమ్మద్ జానీ పాషా, ఆకుల సాయి, జాడ సంతోశ్, ఎండీ సద్దాం హుస్సేన్, రామ్ కుమార్ శర్మ, రాంబాబు పాల్గొన్నారు.