ఆత్మకూరు(ఎం), సెప్టెంబర్ 25 : పాడి రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని అడిగినందుకు కాంగ్రెస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి షోకాజ్ నోటీసులు అందజేయడం సిగ్గు చేటని డీఎల్డీఏ చైర్మన్ మోతే పిచ్చిరెడ్డి అన్నారు. గురువారం ఆత్మకూర్(ఎం) మండలంలోని కూరెళ్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత సంవత్సరం మదర్ డైరీ ఎన్నికల్లో డైరీ పైన అవగాహన లేని, పరిపాలనా అనుభవం లేని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్నేహితుడైన గుడిపాటి మధుసూదన్ రెడ్డిని చైర్మన్ చేయడం వల్ల సంవత్సర కాలంలోనే డైరీకి రూ.11 కోట్లు నష్టం వచ్చిందన్నారు. ఇప్పటికీ మదర్ డైరీ రూ.70 కోట్ల నష్టాల్లో నడుస్తుందని, రానున్న కాలంలో మూత పడటం ఖాయం అన్నారు. పాడి రైతులకు 3 నెలల నుంచి పాల బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.
మదర్ డైరీ డైరెక్టర్గా తన భార్య మోతే పూలమ్మకు అవకాశం కల్పించాలని ఎన్నికల ముందు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను కోరగా హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు నామినేషన్ వేసిన తర్వాత విరమించుకోవాలని ఒత్తిడి తెచ్చారు. 24 గంటలలోపు విరమించుకోకుంటే పార్టీ నుండి సస్పెండ్ చేస్తామని షోకాజ్ నోటీసు అందజేసినట్లు తెలిపారు. ఎలాంటి కారణం లేకుండా షోకాజ్ నోటీసులు అందజేసి అగౌరవ పరిచిన కాంగ్రెస్ పార్టీతో ఇప్పటి నుండి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ సమావేశంలో మదర్ డైరీ మాజీ డైరెక్టర్ మోతే పూలమ్మ పాల్గొన్నారు.