మోత్కూరు, మార్చి 22 : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలో బీఆర్ఎస్వీ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తు చర్యలకు దిగారు. అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్నారన్న సమాచారంతో మోత్కూర్ టౌన్ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు జంగ శివ, బీఆర్ఎస్వీ మోత్కూర్ మండలాధ్యక్షుడు పబ్బు ప్రవీణ్, బీఆర్ఎస్వీ నాయకులు&బీఆర్ఎస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జిట్ట సాయికుమార్, మల్లికార్జున్, సాగర్ ను శనివారం ఉదయం మోత్కూర్ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అరెస్టులను బీఆర్ఎస్వీ నాయకులు తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇదేనా ఇందిరమ్మ పాలన అంటే? ఇందిరమ్మ పాలన అంటే అక్రమ అరెస్టు లేనా? ఇదేనా ప్రజా పాలన? అని ప్రశ్నించారు. ఏ చిన్న కార్యక్రమం అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్టులతో ఆగమాగం అవుతుందన్నారు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, కేవలం 12,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసినట్లు దుయ్యబట్టారు. అదేవిధంగా విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అని మోసం చేశాడని, ఇంతవరకు కాలేజీ విద్యార్థులకు స్కాలర్షిప్ల ఊసే లేదని పేర్కొన్నారు.