తుర్కపల్లి, జూన్ 04 : తుర్కపల్లి మండల కేంద్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు కోసం సేకరించిన స్థలంలో ప్రస్తుత ప్రభుత్వం ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేసి కాలుష్య రహిత పరిశమ్రలు ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ తుర్కపల్లి మండలాధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 6న సీఎం రేవంత్‌రెడ్డి తిరుమలాపురం గ్రామంలో బహిరంగ సభలో పాల్గొననున్నందున ఈ ప్రాంత అభివృద్ధితో పాటు సమస్యలను పరిష్కరించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలు కావస్తున్న నేటికి ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటుకు చొరవ చూపకపోవడంతో నిరుద్యోగ యువత ఎదురుచూస్తుందన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మండల కేంద్రంలో ప్రస్తుతం ఉరి మధ్యలో ఉండడంతో మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చే రోగులకు ఇబ్బందికరంగా ఉందన్నారు. భువనగిరి గజ్వేల్ ప్రధాన రహదారిలో ప్రభుత్వం 100 పడకల దవాఖానను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. అలాగే గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణాన్ని శంకుస్థాపనకే పరిమితం చేయకుండా భూ నిర్వాసితులందరికి న్యాయమైన పరిహరం అందించి ఉపాధి కల్పించాలన్నారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లను గోదావరి జలాలతో నింపాలన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాసాలమర్రి అభివృద్ధి కోసం 159 జీఓ కింద రూ.58 కోట్లు కేటాయించి స్కూల్, ప్రభుత్వ భవనాల నిర్మాణాలు ప్రారంభించారని, ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన అనంతరం నిధులు విడుదల చేయకపోవడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయినట్లు తెలిపారు. వెంటనే కలెక్టర్ అకౌంట్లో ఉన్న నిధులను మంజూరు చేసి గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్నారు. ఈ సమావేశంలో మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు పలుగుల నవీన్‌కుమార్, సోషల్ మీడియా నియోజకవర్గ కన్వీనర్ నల్ల శ్రీకాంత్, నాయకులు రాజయ్య, మల్లప్ప, భాస్కర్‌నాయక్, బద్దునాయక్, రాజేశ్, సురేందర్, రహమత్ షరీప్, ఎండీ యాకుబ్ పాల్గొన్నారు.