అడ్డగూడూరు, జూన్ 14: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని చెరువు అక్రమార్కులకు అడ్డగా మారింది. అక్రమార్కులు అడ్డగోలు తవ్వకాలు చేపడుతూ మట్టిని లూటీ చేస్తున్నారు. చెరువులోని మట్టిని తవ్వడానికి ఇరిగేషన్, పంచాయతీ అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అనుమతులు లేకుండా యథేచ్ఛగా చెరువుల్లోని మట్టిని జేసీబీలు, ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. చెరువులోని మట్టిని రైతుల పొల్లాల్లో పోసుకుంటే అడ్డుపడే అధికారులు 1000 ట్రిప్పుల చెరువు మట్టి ఇటుకబట్టీల కోసం తరలిస్తుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అడ్డగూడూరు చెరువు నుంచి కొండంపేట గ్రామంలోని ఇటుక బట్టి నిర్వహించే వ్యాపారికి చెరువు మట్టిని తరలిస్తుంటే అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటుకబట్టీలకు చెరువు మట్టిని తరలించకుండా చరయలు తీసుకోవాలని ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Addagudur (1)
పొంచి ఉన్న ప్రమాదం ….
చెరువులో అడ్డగోలుగా తవ్వకాలు చేపడుతుండటంతో లోతైన గుంతలు ఏర్పడుతున్నాయి. వర్షం పడినప్పుడు వరద నీరు నిలుస్తుండటంతో ఎక్కడ ఏ గుంత ఉందో అర్థం కావడం లేదు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, పశువుల కాపర్లకు, మత్స్యకారులకు ప్రమాదం పొంచి ఉంది.