నీలగిరి, సెప్టెంబర్ 1: నల్లగొండ జిల్లాలో వ ర్షం బీభత్సం సృష్టించింది. శనివారం ఉదయం ప్రారంభమైన వాన ఆదివారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా పడింది. కాపురాల, బ్రహ్మంగారి, లతీఫ్సాబ్ గుట్టల నుంచి వర్షపు నీరు పెద్ద ఎత్తున రావడంతో పట్టణంలోని పలు కుంటలు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దేవరకొండ రోడ్డులోని మొదుగుళ్లకుంటలో వరద నీరు వచ్చి చేరడంతో కనకదుర్గ కాలనీ, నీలగిరి, హిమగిరి, వసుంధర కాలనీలు అలాగే పానగల్ ఫైఓవర్ సమీపం కాలనీల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతుండడంతో చెరువు కట్టలను తొలగించి నీటిని పంపించారు.
పాతబస్తీలోని మోతీకుంట నిండడంతో నిండి ఇండ్లలోని వచ్చి ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో దాన్ని కూడా జేసీబీల సాయంతో కట్టలను తెంచి నీటిని బయటికు పంపారు. అక్కచెల్మ బజారులో శిథిలావస్థ్ధ ఇంటిని గుర్తించి ఇంటిలోని కుటుంబ సభ్యులను ఆదివారం ఉదయం నిరాశ్రయుల కేంద్రానికి తరలించారు. వారు బయటకు వెళ్లి న తరువాత సుమారు 11 గంటల ప్రాం తంలో ఆ ఇల్లు కూలిపోయింది.కొటప్ప ముత్తడి నుంచి వర్షపు నీరు బాగా వస్తుండడంతో పాతపల్లె శేషమ్మగూడెం గ్రామాల మధ్య ఉన్న కల్వర్టు వద్ద నీటి ప్రవహం అధికంగా వచ్చింది. దీంతో అధికారులు అక్కడ సూచికల బోర్డులు ఏర్పాటు చేశారు.
అదనపు కలెక్టర్ పరిశీలన
నల్లగొండ బ్రహ్మంగారి గుట్ట నుంచి వర్షపు నీరు పెద్ద ఎత్తున రావడంతో పాతబస్తీ ప్రాం తంలోని మోతీకుంట నిండిపోయింది. దాంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై కుంటలోని నీటిని బయటకు పంపిచేలా ఏర్పాట్లు చేశారు. ఈ కుంటను అదనపు కలెక్టర్ జే.శ్రీనివాస్, ఆర్డీఓ రవి పరిశీలించారు. అలాగే మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ పలు లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. డ్రైనేజీ, నాలాల్లో ఎక్కడ కూడా చెత్త చెదారం లేకుండా చూడాలని, వరద నీరు సాఫీగా వెళ్లేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
కాశీవారిగూడెం వద్ద కాల్వకు గండి
తిప్పర్తి : మండలంలోని గంగన్నపాలెం, ఎర్రగడ్డలగూడెం చెరువులు అలుగు పోస్తున్నాయి. మామిడాల వద్ద గల వాగు ఉదృతంగా ప్రవహిస్తున్నది. పంట పొలాల్లోకి నీరు చేరడంతో గండ్లు కొట్టుటకు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చెర్వుపల్లికి వెళ్లే కాల్వకు కాశివారిగూడెం వద్ద గండి పడింది. దాంతో విషయం తెలుసుకున్న డీఎస్పీ శివరాంరెడ్డి, ఎస్ఐ డి.రాజుతో కలిసి పరిశీలించారు.
ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు
కట్టంగూర్ : భారీ వర్షానికి రహదారులు, పలు అంతర్గత వీధులన్నీ వర్షపు నీటి నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు, ఈదులూరు చెరువు పూర్తిగా నిండి అలుగు పోస్తుంది. కట్టంగూర్ పెద్ద చెరువు పూర్తిస్థాయిలో నిండి తూము పక్కనే చిన్నగండి పడడంతో నీరంతా వృథాగా కిందికి పోతుంది. కట్టంగూర్‌లో పెద్దవాగు, చిన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. లోతట్టు ప్రాంతాల్లోని పత్తి చేలు నీట మునిగిపోయాయి.
శాలిగౌరారం : శాలిగౌరారం ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరి నిండకుండను తలపిస్తుంది. మండలంలోని ఆకారం, ఊట్కూర్ శివారులో పత్తి, వరి పంటలు నీటమునిగాయి. అడ్లూర్ గ్రామ పాఠశాల ఆవరణంలో నిలిచాయి. మండలంలోని ఎన్జీ కొత్తపల్లి గ్రామానికి చెందిన ఓగోటి మారెమ్మ ఇల్లు పూర్తిగా శిథిలావస్థలోకి చేరడంతో ఏసమయంలో కూలుతుందోనని భయాందోళనకు గురువుతుంది.
కేతేపల్లి ః మండల వ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. దాంతో పలు గ్రామాల్లో చెట్లు కూలిపోయాయి. నివాస గృహాలపై చెట్లు కూలాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 10 భారీ వృక్షాలు కూలిపోయాయి. దీంతో పాఠశాలలోని రెండు గదుల పై కప్పులు పెచ్చులూడే పరిస్థితి ఏర్పడింది. 65 వ నంబరు జాతీయ రహదారి వెంట చెట్లు విరిగి పడటంతో హైమాస్టు లైటు కరెంటు స్తంభం విరిగిపోయింది. కేతేపల్లిలో 4 ఇండ్లు, కొప్పోలులో ఒక ఇళ్లు దెబ్బతినగా కొత్తపేటలో నివాస గృహంపై వేపచెట్టు కూలిపోయింది.గ్రామాల్లో చెరువులు కుంటలు నిడటంతో అలుగు పోస్తున్నాయి. మండల కేంద్రంలో విరిగిన చెట్లను, ప్రభుత్వ పాఠశాలను ఆర్డీఓ రవి పరిశీలించారు. ఆయన వెంట తాసీల్దార్ మధుసూదన్‌రెడ్డి ఉన్నారు.
72 గంటలు అప్రమత్తంగా ఉండాలి
ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ : భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో 72గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆదేశించారు. ఆదివారం ఆర్డీఓ కార్యాలయంలో మున్సిపల్, విద్యుత్, పంచాయతీరాజ్, పోలీసు, ఆర్డబ్యూఎస్, ఇరిగేషన్, ఆర్అండ్బీ, ఎంపీడీఓ తదితర శాఖల అధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ సమాచారం అయినా కంట్రోల్ రూమ్‌కు తెలియజేయాలన్నారు. విద్యుత్ కోతలు విధించరాదన్నారు. అనంతరం పట్టణంలోని షాబునగర్, తాళ్లగడ్డ, బంగారుగడ్డ తదితర లోతట్టు ప్రాంతాలను సందర్శించి ఆయా కాలనీవాసులతో మాట్లాడారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ ఎండీ.యూసుఫ్, తాసీల్దార్ హరిబాబు, ఎంపీడీఓ శేషగిరిశర్మ, సీఐలు కరుణాకర్, నాగార్జున, ఎస్ఐలు, ఆర్ఐలు, అధికారులు పాల్గొన్నారు.
పాలేరువాగు పై కుంగిన వంతెన
మిర్యాలగూడ రూరల్ : ఎడతెరిపి లేకుండా కురవడంతో జనం ఇండ్లకే పరిమితమయ్యారు. మండలంలో వరద నీటితో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తక్కెళ్ల పహాడ్ గ్రామం వద్ద పాలేరు వాగుపై నిర్మించిన వంతెన వరద ఉధృతికి కోతకు గురై కుంగి వరద ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. యాద్గార్పల్లి ,తక్కెళ్లపహాడ్ గ్రామాల వద్ద ఆర్అండ్బీ రోడ్డుపై వృక్షాలు పడి పోవడం తో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిం ది. ఎంపీడీఓ శేషగిరి శర్మ ఘటన స్థలానికి వెళ్లి చెట్లకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.
మత్తడి దుంకుతున్న చెరువులు
హాలియా : నాగార్జునసాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. చెరువులు నిండి మత్తడి దుంకుతున్నాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పలు చోట్ల పొలాలు నీటమునిగాయి. రాకపోకలకు అంతరాయం కల్గింది. అనుముల మండలంలోని హాలియా వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా పేరూరు సోమసముద్రం, అనుముల రామసముద్రం, రామడుగు, యాచారం, మారేపల్లి చెరువులు అలుగుపోస్తున్నాయి. పేరూరు సోమసముద్రం చెరువు అలుగు ఉధృతంగా పోయడంతో హాలియా- పేరూరు రహదారిపైకి నీరు రావడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. త్రిపురారం మండలంలో తుంగపాడు బంధం ఉధృతంగా ప్రవహిస్తుంది. కొన్ని వందల ఎకరాలు వ్యవసాయ మోటార్లు నీటమునిగినాయి. పలుగుతండా, నీలాయిగూడెం, అప్పలమ్మగూడెం, ఎస్‌ఎన్‌పురం గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పెద్దవూర మండలంలో శషిలేటి వాగు, బట్టుగూడెం వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తుంగతుర్తి, శిరసనగండ్ల, నాయనివానికుంట, పెద్దవూర చెరువులు మత్తడి దుంకుతున్నాయి.
డిండి ప్రాజెక్టులోకి భారీగా వరద
డిండి : భారీ వర్షానికి డిండి ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టు ఎత్తు 36 అడుగులు కాగా నీటి సామర్థ్యం 2.45 టీఎంసీలు. శనివారం సాయంత్రం వరకు డిండి ప్రాజెక్టులో నీటి మట్టం 15 అడుగులు నీటి మట్టం ఉండగా ఆదివారం సాయంత్రం 6 గంటలకు 30 అడుగులకు చేరింది. పైనుంచి 19వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తుండడంతో సోమవారం ఉదయంలోపే ప్రాజెక్టు ఔట్‌ఫ్లో అయ్యే అవకాశం ఉన్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.
మునుగోడు-సోలిపురం రాకపోకలు బంద్
మునుగోడు: వర్షాలు నేపథ్యంలో బొడంగ్పర్తి వాగు వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మునుగోడు-సోలిపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గతేడాది రూ. 404.50లక్షల నిధులతో బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయించి వాగు బ్రిడ్జికి శంకుస్థాపన చేసిన నేటికి కార్యరూపం దాల్చకపోవడంతో సోలిపురం గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చిట్యాల : వర్షానికి మండలలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొన్నది. గుండ్రాంపల్లిలో ఏపూరు రోడ్డు ఆంజనేయ స్వామి దేవాలయం ప్రహరీ కూలిపోయింది. గుండ్రాంపల్లిలోని దేవుడి ( శ్రీరామలింగేశ్వర స్వామి) చెరువు, పలు చెరువుల్లోకి వర్షం నీరు వచ్చి చేరుతుంది.
చందంపేటలో
చందంపేట : డిండి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో చందంపేట మండలంలోని మన్నెవారిపల్లి బ్రిడ్జి తీవ్రస్థాయిలో ప్రవహిస్తుండడంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. చందంపేట మండలంలోని ముర్పునూతల గ్రామం మీదుగా వాగు దాటకుంట పోలీసులు ట్రాక్టర్‌ను అడ్డుగా పెట్టి అటుగా ఎవ్వరు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. డిండి వాగుకు సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అత్యవసర సేవల నిమిత్తం సెల్.8885441588కు సంప్రదించాలని తాసీల్దార్ శ్రీనివాస్ కోరారు.
ఔరవాణిలో కూలిన ఇల్లు
నార్కట్‌పల్లి : మండలంలోని జువ్విగూడెం గ్రామ పరిధిలోని గడ్డమీదిబావి కుంట ఆదివారం అలుగు పోసింది. అలాగే ఔరవాణి గ్రామానికి చెందిన నడిగోటి యాదమ్మ ఇల్లు ఆదివారం కూలిపోయింది. తన భర్త చనిపోయాడని, కుమారుడు భిక్షం పక్షవాతంతో బాధపడుతున్నాడని, వితంతు పెన్షన్ మీదే ఆధారపడి జీవిస్తున్నామని పేర్కొన్నారు. తాము నిరాశ్రయులమయ్యామని ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : హ్రుక్టర్ నారాయణరెడ్డి
నకిరేకల్/ నార్కట్‌పల్లి : జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రమాదాలు జరుగకుండా అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. నకిరేకల్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో పై అంతస్తులో వర్షం నీరు లీకేజీ ద్వారా వస్తుందని తెలుసుకొని ఆదివారం ఎస్పీ శరత్చంద్ర పవార్‌తో కలిసి పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ సోమవారం కూడ వర్షం పడే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లా అధికారుల వరకు సెలవులను రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యా సంస్థలకు సోమవారం సెలవు, ప్రజా వాణిని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అంతకు ముందు నార్కట్‌పల్లి అమ్మనబోలు నుంచి శాలిగౌరారం వెళ్లే మార్గ మధ్యలో ఏడుమూట్లబావి చెరువు నుంచి రోడ్డు పైకి వర్షం నీరు రావడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. అట్టి రోడ్డును వారు పరిశీలించారు. అనంతరం మూసీ వాగు నీటిని పరిశీలించారు. కార్యక్రమాల్లో తాసీల్దార్లు వెంకటేశ్వర్లు, జమీరుద్దీన్,ఎస్ఐ క్రాంతికుమార్, స్పెషల్ ఆఫీసర్ కిరణ్‌కుమార్, ఎంపీడీఓ చంద్రశేఖర్, కమిషనర్ బాలయ్య, ఏఓ జానీమియ,పాఠశాల ప్రిన్సిపల్ స్రవంతి పాల్గొన్నారు.
వర్షాలకు అన్ని చర్యలు తీసుకున్నాం
నార్కట్‌పల్లి : జిల్లా భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. స్థానిక తాసీల్దార్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరో మూడు రోజుల పాటు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వరద ప్రవహించే లెవల్ కల్వర్టులు, రహదారులు దాటకుండా రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో నార్కట్‌పల్లి మీదుగా గుంటూరు నుంచి విజయవాడకు తరలిస్తున్నట్లు ఎస్పీ శరత్చంద్ర పేర్కొన్నారు. జాతీయ రహదారిపై అధిక వాహనాలు ప్రయాణించే క్రమంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా ట్రాఫిక్‌ను నిబంధనలు పాటిస్తూ సురక్షిత గమ్యాన్ని చేరుస్తున్నామని తెలిపారు.