యాదగిరిగుట్ట, ఆగస్టు 22 : ‘ఆలేరు నియోజకవర్గంలో ఏ ఊరుకైనా వెళ్దాం.. దమ్ముంటే వంద శాతం రుణమాఫీ జరిగిందని రుజువు చెయ్’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సవాల్ విసిరారు. ‘ఏ గ్రామం వెళ్దామో నువ్వే ఎంపిక చేసుకో.. నేను రెడీ’ అని స్పష్టం చేశారు. ఆలేరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రైతుల రుణమాఫీ కోసం బీఆర్ఎస్ పార్టీ బుధవారం తలపెట్టిన మహాధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు.
డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్మించి మోసం చేసిందన్నారు. రైతు భరోసా ఊసేలేదని, రుణమాఫీ ఆగమాగమని, వడ్లకు బోనస్ బోగస్‌గానే మారిందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అంటూ బాండ్ పేపర్లు చేతబట్టుకుని కాళ్లూచేతులు పట్టుకుని ఓట్లడిగిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కాలయాపన చేస్తూ ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు.
ఆరు గ్యారంటీల అమలు, రైతుకు రుణమాఫీ ఏమైందని పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఊరూరా వీడియోలను ప్రదర్శించి ఎక్కడికక్కడ నిలదీశామని తెలిపారు. దాంతో ప్రజలు ఇక కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి లేదని సీఎం రేవంత్‌రెడ్డి దేవుళ్ల మీద ఒట్టు పెట్టే కార్యక్రమం పెట్టుకున్నారని గుర్తు చేశారు. భువనగిరి సభలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టుపెట్టి ఏదేమైనా రైతులందరికీ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చాడో, లేదో రైతులు సమాధానం చెప్పాలన్నారు.
ఇప్పడేమైందో రైతులు ఆలోచన చేయాలని కోరారు. ఏ ఊరికి వెళ్లినా 40 శాతం మాత్రమే రుణమాఫీ జరిగిందని, రైతులు వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని చెప్పారు. రుణమాఫీపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులది ఒక్కొక్కరిది ఒక మాట అన్నారు. అబద్ధాలు చెప్పి గోల్మాల్ చేసి రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
గతేడాది కొండపోచమ్మసాగర్ నుంచి చెరువులకు గోదావరి జలాలు విడుదల చేశామని, ఈసారి కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు ఎందుకు విడుదల చేయడం లేదో చెప్పాలన్నారు. నవాబ్‌పేట రిజర్వాయర్ ద్వారా అన్ని చెరువులకు నీళ్లివ్వాలన్నారు. రుణమాఫీ చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలిపారు. అటు అసెంబ్లీలో, ఇటు ప్రజాక్షేత్రంలో పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాధవనేని కృష్ణారావు, ముఠా గోపాల్, బండారు లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్, ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, కల్లూరి రామచంద్రారెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు పల్లె రవికూమార్గౌడ్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ యాదగిరి గుట్ట మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, గంగుల శ్రీనివాస్, పాపట్ల నరహరి, మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకర్, మొరిగాడి వెంకటేశ్, వంటేరు సురేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కపటనాటక సూత్రధారి రేవంత్‌రెడ్డి : ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
రేవంత్‌రెడ్డి అంటే కుచితం, కుతంత్రం, కటిలం, కపటం. ముఖ్యమంత్రి కపట నాటక సూత్రధారి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో చంద్రబాబు నాయుడిని నిలదీయండని అప్పటి జేఏసీ చైర్మన్ కోదండరాంరెడ్డి పిలుపునిస్తే.. ఎవ్వడురా నా చంద్రబాబు నాయుడిని నిలదీసేది.. ఆయన నీడను తాకినా ఊరుకోను అంటూ రైఫిల్ పట్టుకుని కాల్చి పారేస్తానంటూ తిరిగిన ఘనడు రేవంత్‌రెడ్డి. పసికందుగా ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టడానికి డబ్బు సంచులతో బేరాలకు దిగితే హరీశ్‌రావు రెడ్ హ్యాండడ్‌గా పట్టుకున్నాడు.. అందుకే రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు అంటే భయం.
రేవంత్ ఇప్పుడు రాష్ట్ర గీతం చేస్తే ఆ గీతాన్ని ఎప్పుడో తెలంగాణ రాష్ట్రమంతా పాడింది. ఆ గీతాన్ని పాడని గొంతు ఉందంటే అది రేవంత్‌రెడ్డి గొంతే. ప్రజా పాలన అనే రంగు వేసుకుని పౌర హక్కులను కాపాడుతామని చెప్పి మోసం చేశారు. ప్రజా పాలనలో నిరసనలు చేసుకునే వీలుందని నమ్మబలికి ఎక్కడిక్కడ లాఠీ చార్జీలు చేస్తున్నారు. ధర్నాలు చేసే రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారు. రైతులందరికీ రుణమాఫీ చేస్తామని హామీనిచ్చి రైతులను మోసం చేసిన రేవంత్‌రెడ్డికి రైతన్నలు బుద్ధి చెప్పాలి.
40 శాతం మందికే రుణ మాఫీ : మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్
ఏ గ్రామం వెళ్లినా మాకు రాలేదు, మాకు రాలేదని రైతులంతా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని, కేవలం 40 శాతం మందికే రుణమాఫీ చేస్తారా? అని మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. సాంకేతిక అంశాల ఆధారంగా రుణమాఫీ జరుగలేదని సాకులు చెబుతున్నారని, రుణమాఫీ ఎగ్గొట్టేందుకు ఇలా చెబుతున్నారని తెలిపారు.
గర్జించిన ఆలేరు..
ఆలేరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వద్ద రుణమాఫీపై నిర్వహించిన ధర్నాకు నియోజకవర్గానికి చెందిన రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జై కేసీఆర్..రైవంత్రెడ్డి డౌన్ డౌన్..షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసర వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక సర్కార్ కాంగ్రెస్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులందరికీ రుణమాఫీ చేయాలి : మాజీ ప్రభుత్వవిప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి
డిసెంబర్ 9న మాఫీ చేస్తామని రేవంత్‌రెడ్డి ఊకదంపుడు ఉపన్యాసాలు చేసి రైతులను మోసం చేశారని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి విమర్శించారు. లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ఆగస్టు 15లోగా మాఫీ చేస్తామని ఒట్టు వేసి, మాట తప్పారని, అందుకే గుట్టలో పాప పరిహారం చేశామని పేర్కొన్నారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని, లేకుంటే రైతులే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.