భూదాన్ పోచంపల్లి, ఏప్రిల్ 02 : జియో ట్యాగ్ కలిగిన కార్మికులందరికీ త్రిఫ్ట్ ( చేనేత పొదుపు ) పథకంలో వీవర్స్ అనుబంధ కార్మికులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో చేనేత నాయకులు, కార్మికులు బుధవారం ధర్నా నిర్వహించారు. అధికారులు విచారణ చేసిన ఇండ్లలో ఒకరి పేరు ఉండి మరొకరు పేరు లేకపోవడం పట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మగ్గం ఉండి జియో ట్యాగ్ లేని కార్మికులను గుర్తించి వారికి జియో ట్యాగ్ నంబర్ ఇచ్చి పొదుపు పథకం వర్తింపచేయాలన్నారు. చేనేత కార్మికులందరికీ పూర్తి న్యాయం జరిగిన తర్వాత ఆర్డీ -1, ఆర్డీ -2 ఫారం బ్యాంకులకు పంపాలని తెలిపారు.
అర్హుల జాబితాను నోటీసు బోర్డుపై ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించన యెడల ఈ నెల 4వ తేదీన నిరవధిక దీక్ష చేపడతామని హెచ్చరించారు. ఈ మేరకు జిల్లా చేనేత ఔళి శాఖ డీఓ రాజేశ్వర్‌రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. డీఓ స్పందిస్తూ అర్హులైన చేనేత కార్మికులందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చేనేత జన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు చింతకింది రమేశ్, జిల్లా అధ్యక్షుడు కర్నాటి పురుషోత్తం, అఖిలపక్ష కమిటీ నాయకులు చిక్క కృష్ణ , కోడి బాలనరసింహ, గంజి బసవలింగం, మిరియాల కృష్ణమూర్తి, మంగళపల్లి శ్రీహరి, భారత భూషణం, మహేందర్, సీత, కృష్ణ, కార్మికులు పాల్గొన్నారు.
Chenetha Podupu : భూదాన్ పోచంపల్లిలో చేనేత కార్మికుల ధర్నా