భూదాన్ పోచంపల్లి, జనవరి 09 : చేనేత రుణమాఫీ, చేనేత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బిజెపి యాదాద్రి భువనగిరి జిల్లా చేనేత సెల్ ఆధ్వర్యంలో చేనేత కార్మికులు, నాయకులు భూదాన్ పోచంపల్లిలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా పద్మశాలి మహాజన సంఘం అధ్యక్షుడు సీత శ్రీరాములు మాట్లాడుతూ.. చేనేత సమస్యలను పరిష్కరించడంలో కాలయాపన చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను మోసం చేస్తుందని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా చేనేత కార్మికులు సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
లక్ష రూపాయల చేనేత రుణమాఫీ, చేనేత భరోసా పథకం కింద సంవత్సరానికి రూ.24 వేలు, త్రిఫ్ట్ స్కీం కింద ఆర్డి 2 ఖాతాలో ప్రభుత్వం తమ వాటాను చెల్లించాలన్నారు. చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్నారు. కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత సెల్ జిల్లా అధ్యక్షుడు గంజి బసవలింగం, చేనేత జన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు చింతకింది రమేశ్, బిజెపి అసెంబ్లీ కన్వీనర్ చిక్క కృష్ణ, పట్టణ అధ్యక్షుడు డబ్బికార్ సాహేష్, పద్మశాలి చేనేత కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు భారత భూషణ్, నాయకులు జల్దీ నరసింహ, రచ్చ సత్యనారాయణ, లక్ష్మణ్, చిందం ఉప్పలయ్య పాల్గొన్నారు.