సంస్థాన్ నారాయణపురం, మే 31 : సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జ గ్రామానికి లింక్ రోడ్ల నిర్మాణం లేకపోవడంతో రైతులు, గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో లింక్ రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని కోరుతూ గ్రామానికి చెందిన పలువురు యువకులు సదరు రోడ్లపై పాదయాత్ర చేసి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా గుజ్జ గ్రామం అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. ఊరి అభివృద్ధిని పట్టించుకునే ప్రజా ప్రతినిధి కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి గ్రామంలోని లింక్ రోడ్డు నిర్మాణాలను పూర్తి చేస్తామని హామీలు ఇస్తున్నారే తప్పా అమలు చేయడం లేదని విమర్శించారు.
గుజ్జ గ్రామంలో ప్రధాన రోడ్డు సమస్యలైన గుజ్జ నుండి చల్మడ, గుజ్జ – ఏపూరు, గుజ్జ – లింగవారిగూడెం, గుజ్జ – కోతులారం లింక్ రోడ్లను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎలిజాల శ్రీను, చిన్నం ప్రశాంత్ కుమార్, బొద్దుల సాంబశివరావు, పగిళ్ల శ్రీకాంత్, ఏనుగుల బాబు, చిన్నం రాజీవ్, పడసనబోయిన శంకర్, బంగారు వేణు, శ్రీపతి సమరసింహారెడ్డి, పోలోజు ప్రకాశ్, వెలిజాల శ్రీకాంత్, పరసనబోయిన లింగస్వామి, దోటి సీతారాం, గోపరాజు మణి, వెలిజాల మహేశ్, పోలోజు శివ పాల్గొన్నారు.